15 July, 2026 | 2:45 PM

ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్

15-07-2026 02:32 PM

దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారబోతున్నాం

అత్యంత అధునాతన నగరంగా ఫ్యూచర్ సిటీ

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాల్లో అమెజాన్ డేటా సెంటర్ నిర్మించింది. చందనవెల్లిలో మరో 98 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అమెజాన్(Amazon) కు కేటాయించింది. పన్నెండేళ్లలో అమెజాన్ రూ. 60 వేల కోట్లు వెచ్చించనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారబోతున్నామని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమలు, టూరిజం, క్రీడా, నైపుణ్యం, వైద్య రంగాల్లో పాలసీలు తెచ్చామని వెల్లడించారు. అమెజాన్ డేటా సెంటర్.. ఫ్యూచర్ సిటీలో ప్రముఖ పాత్ర పోషించనుందని వెల్లడించారు. ఓఆర్ఆర్, విమానాశ్రయం, ఫార్మా కంపెనీలు, అనేక సేవలు అందిస్తున్నాయని సూచించారు. అమెజాన్ ప్రతినిధులు అనురాగ్, విక్రంకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

భారత్ ఫ్యూచర్ సిటీకి మరిన్ని పెట్టుబడులను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అత్యంత అధునాతన నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల  లక్ష్యంగా చేరుకుంటామని తెలిపారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలనేది తమ లక్ష్యమని సూచించారు. ఐఎస్ బీ, నల్సార్ సహా అనేక సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని సూచించారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తున్నామన్నారు. పారిశ్రామికవేత్తలకు అనే రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై ప్రతినెలా సమీక్ష చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అమెజాన్ డేటా సెంటర్(Amazon Data Center).. ఫ్యూచర్ సిటీలో ప్రముఖ పాత్ర పోషించనుందని సీఎం వెల్లడించారు. హైదరాబాద్ లోని 3 వేల ఆర్టీసీ బస్సులను ఈవీగా మారుస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లోని 2 లక్షల ఆటోలను ఈవీలుగా మార్చేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈవీ వాహనాల రిజిస్ట్రేషన్ లో జీరో ట్యాక్స్ అమలు చేస్తున్నామన్నారు. గొప్ప నగరంగా మారాలనే మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ చేపట్టామని సూచించారు. ఫార్మా పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తీసుకెళ్తున్నామన్నారు. హైదరాబాద్ లో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు.