5 March, 2026 | 4:48 AM

అదనంగా ఐపీఎస్‌లను ఇవ్వండి

05-03-2026 01:31 AM
  1. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

మావోయిస్టుల లొంగుబాటు.. 

పునరావాసంపై కేంద్ర మంత్రితో చర్చలు

న్యూఢిల్లీ, మార్చి 4 : తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను అదనంగా కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అమిత్ షాతో సీఎం బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని.. 2021లో జరగాల్సిన క్యాడర్ రివ్యూ  చాలా ఆలస్యంగా 2025లో జరిగిందన్నారు.

ఆ సమయంలోనూ కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయిం చారని సీఎం వివరించారు. అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరా లు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్ల ను ఎదుర్కొంటోందని సీఎం తెలిపా రు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ కమిషనర్, హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్దసంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని కేంద్రమంత్రికి తెలిపారు.

మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 83 ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నారని.. ఆ సంఖ్యను 105కు పెంచి కేటాయించాలని సీఎం కోరారు. అనంతరం మావోయిస్టుల లొంగుబాటుపై కేంద్ర మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చర్చించారు. ఇటీవల మావోయిస్టు అగ్ర నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. 

గత రెండేళ్లలో తెలంగాణ పోలీసింగ్‌లో గణనీయమైన మార్పులు వచ్చాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని కేంద్రమంత్రి అమిత్ షా దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారని,

వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం విషయాలను కేంద్ర మంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి సహకరించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వీ శేషాద్రి, రాష్ట్ర డీజీపీ బీ శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఎస్‌ఐబీ ఐజీపీ బీ సుమతి పాల్గొన్నారు.