హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు
జిల్లా ఎస్పీ మహేష్ బి గితే
సిరిసిల్ల, ఏప్రిల్ 29,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నలుగురు నిందితులకు సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ జీవిత ఖైదు విధించారు. ప్రతి నిందితుడికి రూ.6,000 జరిమానా కూడా విధించారు. 2020 డిసెంబర్ 27న బద్నకల్ గ్రామంలో వ్యవసాయ భూమి సరిహద్దుల వివాదంతో కస్తూరి రాంరెడ్డి, అతని భార్య మంజుల, కుమారులు వెంకటేశ్, మహేష్ కలిసి కస్తూరి కరుణాకర్ రెడ్డిని గొడ్డలితో నరికి, కట్టెలతో కొట్టి హత్య చేశారు.
మృతుడి సోదరి పద్మా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.అప్పటి సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ ఛార్జ్షీట్ దాఖలు చేయగా, అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో సీఐ మొగిలి, ఎస్త్స్ర రవీంద్ర నాయుడు, కానిస్టేబుళ్లు రాజేందర్ నాయక్, నవీన్ 14 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పెంట శ్రీనివాస్, అశ్విన్ వాదనలు వినిపించారు.
నేరం రుజువవడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ కేసులో కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, పీపీలు పెంట శ్రీనివాస్, అశ్విన్, సీఐలు సర్వర్, ఉపేందర్, మొగిలి, ఎస్త్స్ర రవీందర్ నాయుడు, కానిస్టేబుళ్లు నవీన్, రాజేందర్, దేవేందర్, ప్రస్తుత సీఐ నాగేశ్వరరావు, ఎస్త్స్ర గణేష్లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు.నేరం చేస్తే శిక్ష తప్పదు& శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యం అని ఎస్పీ మహేష్ బి. గితే పేర్కొన్నారు.






