తీహార్ జైల్లో మాజీ కాంగ్రెస్ ఎంపీ మృతి
న్యూఢిల్లీ: వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో ఐదుగురి హత్యకు సంబంధించి దోషిగా తేలిన మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్ కుమార్(Former Congress MP Sajjan Kumar dies) గురువారం ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏళ్లు. సిక్కు వ్యతిరేక ఆందోళన కేసులో సజ్జన్ కుమార్ శిక్ష అనుభవిస్తున్నారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు పడింది. తిహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కుమార్‌ను హుటాహుటిన సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఆయన మరణానికి గల కారణాన్ని ఆసుపత్రి వర్గాలు ఇంకా వెల్లడించలేదు. ఢిల్లీ హైకోర్టు 2018లో సజ్జన్ కుమార్ కు జీవితఖైదు విధించింది. మూడు పర్యాయాలు లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరించిన సజ్జన్ కుమార్, ఔటర్ ఢిల్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. 2018లో దోషిగా తేలిన తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేశారు. 1984 అక్టోబర్ 31న మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సిక్కు అంగరక్షకులైన సత్వవంత్ సింగ్, బియంత్ సింగ్ హత్య చేసిన తర్వాత ఈ అల్లర్లు చెలరేగాయి. ఆయుధాలు ధరించిన గుంపులు ఢిల్లీ అంతటా సిక్కులను లక్ష్యంగా చేసుకుని, వారి ఇళ్లు, దుకాణాలపై దాడులు చేశాయి. భారతదేశం అంతటా, ముఖ్యంగా దేశ రాజధానిలో, 3,000 మందికి పైగా సిక్కులు హత్యకు గురయ్యారు.






