కూకట్‌పల్లిలో ఫుడ్‌సేప్టీ అధికారుల దాడులు.. రెస్టారెంట్లకు నోటీసులు
హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి(Kukatpally), మూసాపేటలోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు(Food safety officials) దాడులు నిర్వహించారు. అపరిశుభ్రత వాతావరణంలో ఆహార పదార్థాలు నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు. కూకట్ పల్లిలోని సిద్దిఖీ కబాబ్ సెంటర్ అపరిశుభ్ర పరిస్థితులు, బాగ్ అమీర్ లోని శ్రీద్వారకా గ్రాండ్ క్లౌడ్ కిచెన్ లో కాలం చెల్లిన పదార్థాలు, మాంసాన్ని అపరిశుభ్ర ఫ్రిజ్ లలో భద్రపరిచినట్లు గుర్తించారు. శ్రీ ద్వారకా గ్రాండ్ రెస్టారెంట్(Sri Dwaraka Grand Restaurant) ఆహార తనిఖీల్లో దారుణం బయట పడింది.
హోటల్ యజమాని కిచెన్ లో పిల్లులను పెంచుతున్నాడు. కిచెన్ పరిసర ప్రాంతాలన్నీ పిల్లులు గుంపులను గుర్తించారు. హోటల్ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు(FSSAI License) గడువు ముగిసిందని అధికారులు పేర్కొన్నారు. కిచెన్ పరిసరాలన్నీ ఈగల మయంగా ఉందని, కిచెన్ పరిసరాలను సరిచేసుకునేంత వరకు రెస్టారెంట్ మూసివేయాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు(Cyberabad Municipal Corporation Food Safety Officials) నోటీసు జారీ చేశారు. కిచెన్లలో ఎలుకలు, బొద్దింకలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మూసాపేటలోని అరేబియన్ మండిలో విరివిగా సింథటిక్ ఫుడ్ కలర్స్, వైన్ అండ్ డైన్ బార్ లో కాలం చెల్లిన పుట్టగొడుగులు, పప్పులు వినియోగిస్తున్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. దాడుల అనంతరం పలు రెస్టారెంట్లకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.






