ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని ఐటీఓ (ITO) కార్యాలయంలోని వాణిజ్య, పన్నుల భవనంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ఆరు అగ్నిమాపక వాహనాలను ఘటనా స్థలానికి పంపి మంటలను అదుపుచేసినట్లు ఢిల్లీ అగ్నిమాపక సేవల అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించినట్లు నివేదికలు లేవని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి సంబంధించి ఉదయం 8:36 గంటలకు ఒక సమాచారం అందిందని, వెంటనే ఆరు అగ్నిమాపక వాహనాలను ఘటనా స్థలానికి పంపించామని తెలిపారు.
అలాగే, ఉదయం 9:10 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. విక్రయ పన్ను కార్యాలయం ఉన్న భవనం 12వ అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించిందని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఉదయం నైరుతి ఢిల్లీలోని పాలం ప్రాంతంలో ఉన్న ఒక నాలుగు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించి, తొమ్మిది మంది మరణించగా, మరో ముగ్గురు గాయపడిన విషయం తెలిసిందే.




