జోరుగా ఉపాధి హామీ పనులు..
ప్రతిరోజు 1500 మంది కూలీల హాజరు..
గ్రామాలలో ఊపందుకున్న పనులు...
తాడ్వాయి, మే 21 (విజయక్రాంతి): గ్రామాలలోని పేదలకు పనులు కల్పించి తద్వారా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు వేల సంఖ్యలో పేదలు ఉపాధి హామీ పనులలో పాల్గొని ఉపాధి పొందుతున్నారు. రోజు రూ.150 నుంచి రూ.300 వరకు కూలీలు కూలీ డబ్బులు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉపాధి పనులలో కూలీలు పాల్గొని కూలీ పొందుతున్నారు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. మండలంలోని గ్రామాలలో ప్రతిరోజు 1300 నుంచి 1500 మంది వరకు కూలీలు ఉపాధి హామీ పనులలో పాల్గొని పనులు చేస్తున్నారు. వేసవికాలం వచ్చిందంటే చాలు గ్రామాల్లోని పేదలకు ఈ పథకం ఓ వరం లా మారింది.ఎంతోమంది పేద కూలీలు ఈ పథకంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ కోసం ఓ మంచి పథకాన్ని రూపొందించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చెరువుల్లో, కుంటలలో పూడికతీత పనులు..
మండలంలోని చెరువులలో కుంటల్లో కూడికతీత పనులు ఎక్కువగా సాగుతున్నాయి. గ్రామ శివారులో కందకాలు సైతం తవ్విస్తున్నారు. భూగర్భ జలాలను పెంచాలనే లక్ష్యంతో అధికారులు ఈ పనులను ప్రత్యేకంగా రూపొందించారు. చెరువులలో పేరుకుపోయిన మట్టిని తొలగించి వేస్తున్నారు. దీంతో చెరువులలో, కుంటల్లో కూరుకుపోయిన మట్టిని తొలగించడంతో చెరువులు లోతుగా మారుతున్నాయి. కుంటలు లోతుగా మారుతున్నాయి.
దీంతో భూగర్భ జలాలు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.వర్షాలు వచ్చిన సమయంలో గతంలో కంటే చెరువులలో కుంటల్లో నీళ్లు ఎక్కువ స్థాయిలో నిలిచే అవకాశం ఉంటుంది.ఇటు భూగర్భ జలాల అభివృద్ధితో పాటు అటు కూలీలకు సైతం ఉపాధి అవకాశం లభిస్తుంది.
మండలంలోని ఎర్రపహాడు, దేమికళాన్, నందివాడ, కరాడ్పల్లి, చిట్యాల, ఎండ్రియాల, కృష్ణాజివాడి, బ్రహ్మాజీ వాడి,బ్రాహ్మణపల్లి గ్రామాల్లో పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకంగా గ్రామ శివారులో అటవీ ప్రాంతాలలో కందకాలు తవ్విస్తున్నారు. ఈ కందకాల తవ్వకంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వర్షానికి వచ్చిన నీరు వృధాగా పోకుండా నీళ్లు కందకాల్లో నిలిచి భూగర్భ జలాలు పెరుగుతాయి.అందుకోసమే అధికారులు ప్రత్యేకంగా కందకాలను తవ్విస్తున్నారు.
కూలీలకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి..
ఉపాధి హామీ కూలీలకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కూలీలు కోరుతున్నారు. పనులు చేస్తున్న ప్రాంతాల్లో తాగు నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. కొన్ని ప్రాంతాలలో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పనులు జరుగుతున్న ప్రాంతాల్లో టెంట్లు ఏర్పాటు చేయాలని కూలీలు విన్నవిస్తున్నారు. టెంట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. కూలీలకు సౌకర్యాలు కల్పించాలనే నిబంధనలు ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి.
కూలీలకు ప్రథమ చికిత్స ఏర్పాట్లు కరువు...
ఉపాధి హామీ కూలీలకు ఏవైనా దెబ్బలు తగిలిన సమయంలో కానీ, గాయాలు అయినా సమయంలో కాని ప్రత్యేకంగా కూలీలకు ప్రథమ చికిత్సలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.కానీ సంబంధిత అధికారులు తమకేమి పట్టనట్లుగా కూలీలకు ప్రథమ చికిత్సలు అందుబాటులో ఉంచడం లేదు.
ఏమైనా ఇబ్బందులు కలిగిన సమయంలో వెంటనే ప్రథమ చికిత్స నిర్వహించి అవసరమైన మాత్రలు సైతం అందించాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అధికారులు వీటిని అమలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కచ్చితంగా ప్రథమ చికిత్స కిట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని కూలీలు కోరుతున్నారు.






