19 July, 2026 | 3:09 PM

పిండిప్రోలులో దారుణం.. బంగారం కోసం వృద్ధురాలి హత్య

19-07-2026 09:26 AM

పక్షవాతంతో మంచానికే పరిమితమైన భర్త ఎదుటే కిరాతకం

నిందితుల కోసం పోలీసుల ముమ్మర గాలింపు

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో శనివారం బంగారు ఆభరణాల కోసం ఇంట్లోకి చొరబడిన దుండగులు, ప్రతిఘటించిన 70 ఏళ్ల వృద్ధురాలు చెన్నా సుగుణమ్మను దారుణంగా హత్య చేశారు. పక్షవాతంతో మంచానికే పరిమితమైన భర్త జనార్దన్ కళ్లెదుటే ఈ కిరాతకం చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పదిహేనేళ్ల క్రితం పెద్ద కుమారుడిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన ఈ దంపతులు ప్రస్తుతం ప్రభుత్వం అందించే వృద్ధాప్య పెన్షన్‌తోనే జీవనం సాగిస్తున్నారు. చిన్న కుమారుడు తిరుమలరావు సత్తుపల్లి విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు.

శనివారం రెండు నుంచి మూడు గంటల మధ్య ఇంట్లోకి చొరబడిన దుండగులు సుగుణమ్మ మెడలోని బంగారు ఆభరణాలు లాక్కోవడానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. దీంతో ముందుగా ఆమె కళ్లలో కారం చల్లి, అనంతరం పదునైన ఆయుధంతో తలపై బలంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. కదలలేని స్థితిలో ఉన్న భర్త జనార్దన్ ఈ ఘటనను కళ్లారా చూస్తూ భార్యను కాపాడలేక నిస్సహాయంగా కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న చిన్న కుమారుడు తిరుమలరావు గ్రామానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, కూసుమంచి సీఐ సంజీవ్, స్థానిక ఎస్సై కూచిపూడి జగదీష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. సుగుణమ్మ వద్ద బంగారు నగలు ఉన్న విషయం ముందుగానే తెలిసిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తుండగా, నిందితులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.