17 April, 2026 | 3:07 AM

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

17-04-2026 01:17 AM
  1. చేనేత కార్మికులకు చెక్కుల పంపిణీ 

కార్యక్రమంలో కలెక్టర్, గద్వాల, అలంపూర్ శాసనసభ్యులు

గద్వాల టౌన్ , ఏప్రిల్ 16 :గద్వాల చేనేత జరీ చీరలు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయని, ఇక్కడి చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో గురువారం గద్వాల అనంత ఫంక్షన్ హాల్లో నేతన్న భరోసా, చేనేత రుణమాఫీ, నేతన్న భద్రత (నేతన్న భీమా) పథకాలకు సంబంధించి చేనేత కార్మికులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి గద్వాల, అలంపూర్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గద్వాల జిల్లాతో పాటు వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన మొత్తం 32 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు నేతన్న బీమా కింద రూ.5 లక్షల చొప్పున చెక్కులను ఇవ్వడం జరుగుతుందన్నారు. రుణమాఫీకి సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన 1761 మంది కార్మికులకు రూ.11 కోట్ల, వనపర్తి జిల్లాకు చెందిన 338 మంది చేనేత కార్మికులకు రూ.2.5 కోట్ల విలువైన రుణమాఫీ చెక్కులను ఇవ్వడం జరిగిందన్నారు.

నేతన్న భరోసా పథకంలో భాగంగా 5366 మంది కార్మికులకు రూ.1.61 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వివిధ చేనేత సంక్షేమ పథకాలకు నోచుకోని కార్మికులకు త్వరలోనే జియో ట్యాగ్ నెంబర్ల ను ఇప్పించి ఆయా పథకాలను వర్తింప చేస్తామన్నారు. నెల కిందట ఆరగిద్ద గ్రామంలోని పలు చేనేత మగ్గాలను పరిశీలించడం జరిగిందని, చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహనతో పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ప్రజావాణిలో చేనేత చీరల కౌంటర్స్ ఏర్పాటు చేసి అమ్మకాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.

జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి త్వరలో చేనేత సంఘాల ప్రతినిధులు, అధికారులు, కార్మికులతో సమన్వయ సమావేశం నిర్వహించి చేనేత రంగ అభివృద్ధికి చర్చించడం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో గద్వాల పుర చైర్ పర్సన్ జయలక్ష్మి, కౌన్సిలర్ రామలింగేశ్వర కామ్లే, చేనేత జౌళి శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ, డీవో సుధారాణి, ఏడీవో ప్రియాంక, బాలకృష్ణ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, చేనేత సంఘాల ప్రతినిధులు, చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.