27 March, 2026 | 10:18 PM

వంద కాలనీల సమాహారం... విద్యలో వెనక బాటు తనం

27-03-2026 08:32 PM

జనాభా మూడు లక్షలు... రెండే ప్రభుత్వ హై స్కూల్స్

కొండంత జాగ ఉన్నా... కళాశాలలు నిండు సున్నా

యువతకు విద్యను అందించండి... ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ

జవహర్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణలోని పూర్వ అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా, జనాభాపరంగా దాదాపుగా మూడు లక్షల జనాభా, మినీ భారతి గా భారతదేశంలోని వివిధ ప్రాంతాల జనాభా, కొండంత ప్రభుత్వ జాగ ఉన్న కళాశాలలు, పాఠశాలలు నిండు సున్నాగా తయారయ్యాయని జవహర్ నగర్ ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ సభ్యులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ముఖ్యంగా జవహర్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అతిపెద్ద పూర్వ మున్సిపల్ కార్పొరేషన్ గా గణితకెక్కిందని జవహర్ నగర్ పరిధిలో విద్యాలయాలు లేక యువత పెడదారిన పట్టే ప్రమాదం ఉందని, ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ పేర్కొంది. జవహర్ నగర్ మొత్తానికి కేవలం రెండు ప్రభుత్వ హై స్కూల్స్, ఎనిమిది ప్రాథమిక పాఠశాలలు మాత్రమే ఉండగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేక విద్యార్థులు 10 కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకుంటున్నారు.

జవహర్ నగర్ లో కాలేజీ లేకపోవడం వల్ల  వేలాది మంది పిల్లలు మధ్యలోనే విద్యను విడిచి పెట్టే పరిస్థితి నెలకొందని ఈ పరిస్థితులు బాల కార్మిక వ్యవస్థకు బాల్యవివాహాలు దాడులు మత్తు పదార్థాల ప్రభావం వంటి సమస్యలకు దారితీస్తాయని పేర్కొన్నారు. విద్యకు నిరంతర ప్రాముఖ్యత లేకపోవడం వల్ల పిల్లల భవిష్యత్తును మాత్రమే కాకుండా మొత్తం సమాజ అభివృద్ధి కూడా పుట్టుపడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో నర్సరీ నుండి 12వ తరగతి వరకు సమగ్ర విద్యను అందించే తెలంగాణ పబ్లిక్ స్కూల్ (ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్) స్థాపన జవహర్ నగర్ ప్రాంతానికి అత్యవసరంగా మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వ సాధన కమిటీ డిమాండ్ చేస్తుంది.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపిస్తే ఒకే ప్రాంగణంలో ప్రాథమిక విద్య నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యను అందించడం వల్ల విద్యార్థుల డ్రాప్ ట్రేడ్ గణనీయంగా తగ్గి పిల్లలకు సురక్షితమైన స్థిరమైన విద్యా వాతావరంలో నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు. ముఖ్యంగా బస్తీల పిల్లలకు ఇది సమాన అవకాశాలు కల్పించే దిశగా కీలక ముందడుగు పడుతుందని తెలిపారు. ఈ అవసరాన్ని గుర్తించిన గబ్బిలాల పేట, రాజీవ్ గాంధీ నగర్, శాంతినగర్, గిరిప్రసాద్నగర్, నందమూరి నగర్, బస్తీల నివాసులు బస్తీ పెద్దల సమక్షంలో సమావేశమై ఫ్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యను లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వ పాఠశాల సాధనా కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీ సమగ్ర పాఠశాల స్థాపన కోసం ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతుందని అవసరమైన భూమి మౌలిక సదుపాయాలు అనుమతుల కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కమిటీలు కన్వీనర్ గా మోతే రాజేశ్వరి కో- కన్వీనర్లుగా  నాగమణి, సూర వెంకటయ్యను నియమించారు.

యూత్ కన్వీనర్ గా పి. గణేష్ సలహాదారులుగా ఆవుల దుర్గేష్ ,అనసూర్య, శకుంతల, జహంగీర్, జయసుధ, మబ్బు అంజయ్య, గోవాడ మనీ, సభ్యులుగా పి. స్వరూప, బాలలక్ష్మి, స్వప్న, మాధవి, మౌనికను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సమాజం యొక్క ఈ సమిష్టి ప్రయత్నం వల్ల జవహర్ నగర్ ప్రాంతంలో విద్యాహక్కు సాధనలో ఒక ముఖ్యమైన ముందడుగు పడుతుందని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్ ని ఆమోదించి తద్వారా స్కూల్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కమిటీ సభ్యులు బస్తీ వాసులు విజ్ఞప్తి చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం సమాజ అభివృద్ధి కోసం ఇది అత్యవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.