25 March, 2026 | 2:06 AM

డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్

25-03-2026 12:33 AM
  1. ఎల్బీనగర్-- ప్రాంతంలో 941 కోట్లతో నిర్మాణం
  2. మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు 7,600 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
  3. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 24 (విజయ క్రాంతి): హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎల్బీనగర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు సుమారు 5.50 కి.మీ.ల పొడవులో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నట్టు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ అం చనా వ్యయం రూ.941 కోట్లు కాగా, ఇందు లో కేంద్ర ప్రభుత్వం రూ.741 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు భాగస్వామ్యం చేయనున్నాయని తెలిపారు.

మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా రాష్ట్రంలోని ఆర్‌అండ్ బీ రోడ్ల గురించి ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, మనోహర్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, నాగరాజు, మాణిక్ రావు, వీర్లపల్లి శంకర్ పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి కోమటిరెడ్డి సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ..

‘పుణే విభాగంలోని ఎన్ హెచ్ -65పై మదీనాగూడ నుండి బీహెచ్‌ఈఎల్ వరకు 1.20 కి.మీ పొడవులో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 53.55 కోట్ల వాటాకు కూడా అంగీకారం తెలిపిందన్నారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం వరకు రహదారి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికలు రూపొందించామని, ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గి, రోడ్డు భద్రత మెరుగుపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ మార్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చలు జరిపిన అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. మన్ననూరు వరకు ఇప్పటికే 6-లేన్ రహదారి అభివృద్ధి చేపట్టగా, అక్కడి నుంచి శ్రీశైలం వరకు సుమారు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ రూపొందించామని, దాదాపు ఆమోద దశలో ఉందని పేర్కొన్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు రూ.7,600 కోట్లు కాగా, ఇది ప్రస్తుతం ఆమోద దశలో ఉన్నదని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం శాసనసభలో సభ్యులకు వివరించారు.