24 March, 2026 | 3:27 AM

మహిళలంటే చులకనా?

24-03-2026 12:16 AM

30వ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్త సట్టు మంగ ఆవేదన 

ఖమ్మం, మార్చి 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం దేశ,రాష్ట్ర స్థాయిలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తుంటే కిందిస్థాయి పురుష నాయకులు మాత్రం రౌడీ రమాదేవి వ్యవహరిస్తూ, ఆడవాళ్ళు ఇంట్లో కూర్చోని కుటుంబాన్ని చక్కబెట్టుకోకుండా రాజకీయాలు అవసరమా అంటూ తమను అవమాన పరుస్తున్నారని,  30వ  డివిజన్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు సట్టు మంగ ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్డులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కింది స్థాయి నాయకులు మహిళల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్న తీరును వివరించారు. ఈ నెల 21వ తేదీన డివిజన్ పరిధిలో బూత్ లెవల్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమయంలో పార్టీకి చెందిన బొమ్మ ఉదయ్ అనే వ్యక్తి తనను ఉద్దేశించి ‘నీకు రాజకీయాలతో పనేంటి? ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవాలి కదా‘ అంటూ అసభ్యంగా మాట్లాడారని ఆమె ఆరోపించారు.

గతంలోనూ నాలుగైదు సార్లు ఇలాగే కించపరిచారని, ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లినా సదరు వ్యక్తి తీరులో మార్పు రావటం లేదని పేర్కొన్నారు. తాను పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్నానని, 1997 నుంచి గాంధీనగర్ ప్రాంతంలో పార్టీ బలోపేతం కోసం ఒక కార్యకర్తగా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నానని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తన పనితీరు తెలుసన్నారు.

ఇన్నేళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నా, తాను ఎప్పుడూ పదవుల కోసం ఆరాటపడలేదని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంటే, క్షేత్రస్థాయిలో పురుష కార్యకర్తలు మహిళలతో అసభ్యంగా, అవమానకరంగా వ్యవహరిస్తూ అణచివేత చర్యలు  చేయటం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కార్యకర్తలకు గౌరవం దక్కాలని, తనను దూషించిన వ్యక్తిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.