అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు సర్పంచ్ బానోత్ సదర్ లాల్ వినతి
అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో ప్రధాన రహదారిపై అసంపూర్తిగా ఉన్న డివైడర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. శనివారం ఉదయం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి గ్రామానికి సంబంధించిన పలు ప్రధాన సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతాలకు కేంద్రబిందువుగా మారిందని, భద్రాచలం పేపర్ బోర్డ్స్, భారజల కర్మాగారం, సీతారామ ప్రాజెక్టు, సీతమ్మసాగర్, మణుగూరు బొగ్గుగనులు, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లకు అనుసంధానంగా ఉండటంతో వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతోందన్నారు. ముఖ్యంగా జగ్గారం క్రాస్‌రోడ్ నుంచి చింతిర్యాల క్రాస్‌రోడ్ వరకు భారీ వాహనాలు, బస్సులు, కార్లు, ద్విచక్రవాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఇటీవల అశ్వాపురం ఆర్‌అండ్‌బీ కార్యాలయం ఎదురుగా జరిగిన కారు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించిన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల భద్రత దృష్ట్యా రహదారిని విస్తరించి డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. సుజాతనగర్, జూలూరుపాడు, ఎన్కూర్ మండల కేంద్రాల్లో మాదిరిగా అశ్వాపురంలో కూడా సుమారు మూడు కిలోమీటర్ల మేర డివైడర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతిరోజూ పారిశ్రామిక సంస్థలకు వేలాది మంది అధికారులు, కార్మికులు, కాంట్రాక్ట్ సిబ్బంది, దినసరి కూలీలు ప్రయాణిస్తున్న నేపథ్యంలో ప్రజల ప్రాణ రక్షణ కోసం వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు.






