ఆది దేవుని పూజిస్తే సంకటాలు తొలుగుతాయి
ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు
శ్రీ విఘ్నేశ్వరుని దర్శించుకున్న భక్తులు
మంథని,(విజయక్రాంతి): సంకష్టహర చతుర్థి పురస్కరించుకొని ఆదివారం మంథని పట్టణంలోని శ్రీ విఘ్నేశ్వరుని భక్తులు దర్శించుకున్నారు. ప్రతి నెలలో పౌర్ణమి తరువాత వచ్చే చవితి తిథిని సంకష్టహర చతుర్థిగా పరిగణిస్తారు. గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైనది చవితి తిథి. చైత్ర మాసం శుక్లపక్షం ఆదివారం రోజున సంకష్టహర చతుర్థి దీక్ష చేపట్టిన భక్తులకు రాత్రి 9.25 నిమిషములకు చంద్రోదయం కాలం. చంద్రోదయ సమయమునకు చవితి తిథి ఉంటే సంకష్టహర చతుర్థి గా పరిగణిస్తారు.
మంథని పట్టణంలోని తమ్మిచెరువు కట్ట వీధిలో సిద్ధి బుద్ధి సమేతంగా వెలసిన శ్రీ మహాగణపతి దేవాలయంలో భక్తులు విశేష సంఖ్యలో విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు. ఈ రోజున గణపతి మహాగణపతి అనే నామంతో పూజలు అందుకున్నారు. మానవులు తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే సంకటాలను తొలగించుకోవడానికి ఈ దీక్ష చేపడతారు.
ఏ శుభకార్యం చేయాలన్నా మొదట విగ్నేశ్వరున్ని పూజించడం మన సాంప్రదాయం. శ్రీ విఘ్నేశ్వరుని కృప ఉంటే ఎంతటి కష్టములైన తొలగిపోతాయి. భక్తులు ప్రగాఢ విశ్వాసంతో ఆది దేవుని దీక్ష చేపట్టి సన్మార్గంలో జీవించడానికి ఎంత ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రాల్లో పేర్కొనబడింది. నూతనంగా దీక్ష చేపట్టాలనుకునే భక్తులు వచ్చే నెల ఐదో తేదీ రోజున మంగళవారం అంటే అంగారక చతుర్థి దీక్షను స్వీకరిస్తే శుభ ఫలితాలు పొందుతారు.




