ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దెముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డిఎంహెచ్వో రవి యాదవ్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రికార్డులను, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి అక్కడున్న రోగులతో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని? అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మౌలిక సదుపాయాలు అందిస్తున్నారా లేదా? అంటూ కలియతిరిగి పరిశీలించారు.
ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తూ సమయపాలన పాటించాలని ఆసుపత్రి వైద్యాధికారి శ్వేత ను ఆదేశించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంఎస్ఓ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే కాయకల్ప అవార్డు కోసం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేస్తున్నామని అన్నారు. కాయకల్ప అవార్డు దక్కితే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మూడు సంవత్సరాలలో ఆరు లక్షల రూపాయలు వస్తాయని అన్నారు.




