సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
జిల్లా చైర్మన్ బూరుగు రవికుమార్
భూపాలపల్లి,(విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1ను పెన్షన్ వ్యతిరేక దినంగా పాటిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన, మహాధర్నా నిర్వహించారు.
జిల్లా చైర్మన్ బూరుగు రవికుమార్, కార్యదర్శి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1 నుంచి నియమితులైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్ విధానం అన్యాయం చేస్తోందన్నారు. వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రెండవ వేతన సవరణ సంఘాన్ని 51 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు విడతల కరువు భత్యాన్ని విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.12 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై చర్చలకు ఆహ్వానించి పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.






