18 June, 2026 | 6:00 PM

ఏఎన్ఎంలకు సబ్ సెంటర్ల కోసం కౌన్సిలింగ్

18-06-2026 04:50 PM

తుకారామ్ రాథోడ్..

కొత్తగూడెం జూన్ 18 విజయ క్రాంతి: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన G.O.Ms. No. 38 ప్రకారం చేపట్టిన సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా, జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించబడిన 54 మంది మహిళ ఆరోగ్య కార్యకర్తలకు ( ఏఎన్ఎం ) GO MS No 38 ప్రకారం పారదర్శకంగా కౌన్సిలింగ్ నిర్వహించి ఆయా ఆరోగ్య ఉప కేంద్రాలు (సబ్ సెంటర్స్ ) కేటాయించినట్లు జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. తుకారామ్ రాథోడ్ తెలిపారు.

ఈ సందర్భంగా రాథోడ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడంలో ఏ న్ ఎం ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండి తల్లి–శిశు ఆరోగ్య సేవలు, గర్భిణీల నమోదు, క్రమానుసార ఏ ఎన్ సి పరీక్షలు, అధిక ప్రమాద గర్భిణీల (హై రిస్క్ ఏ ఎన్ సి ) గుర్తింపు, సాధారణ ప్రసవాల ప్రోత్సాహం, ప్రసవానంతర సేవలు, నవజాత శిశు సంరక్షణ, పూర్తి స్థాయి టీకాల కార్యక్రమం, కుటుంబ నియంత్రణ సేవలు, కౌమార బాలికల ఆరోగ్య సేవలు, రక్తహీనత నివారణ, సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్, అసంక్రమిత వ్యాధుల (బీపీ , మధుమేహం) స్క్రీనింగ్ వంటి సేవలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. కౌన్సిలింగ్ ద్వారా సబ్ సెంటర్లు కేటాయించబడిన,వారి విధులను సక్రమంగా నిర్వహించాలని విధులలో అలసత్వం, నిర్లక్ష్యం, వహించిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు

యూపీహెచ్ & యు ఎఫ్ డబ్ల్యూ సి  అర్బన్ సిబ్బందితో సమీక్ష 

జూన్ 28వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో పనిచేసే సిబ్బందికి ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. డి ఎం హెచ్ వో  మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణ, డెంగ్యూ, మలేరియా నియంత్రణ చర్యలు, ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం, యాంటీ లార్వల్ చర్యలు, పరిసరాల పరిశుభ్రత, సురక్షిత తాగునీరు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

ప్రతి ఏ ఎన్ ఎం  తన పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి, గర్భిణీలు, బాలింతలు, ఐదేళ్లలోపు పిల్లలు, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అవసరమైన ఆరోగ్య సేవలు అందించడంతో పాటు ప్రజలకు ఆరోగ్య విద్య, పోషకాహారం, యోగా, వ్యాయామం, వ్యక్తిగత పరిశుభ్రత, జీవనశైలి వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజారోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి కుటుంబానికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందేలా అంకితభావంతో పనిచేయాలని డా. తుకారాం రాథోడ్ మహిళ ఆరోగ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డా. తుకారాం రాథోడ్ సూచించారు. జిల్లాలోని ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా ఇంటింటి సర్వే నిర్వహించి పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించారు. పల్స్ పోలియోపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రతాప్, శ్రీధర్, కళ్యాణి, మోహన్, శ్రీనివాస్, జానకి, ఉమాదేవి ఉద్యోగ సంఘ బాధ్యులు, కార్యాలయ సిబ్బంది , పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.