ఓటర్ల సవరణ, సభ్యత్వ నమోదు అవగాహన సదస్సును విజయవంతం చేయండి: హరిప్రియ నాయక్
ఇల్లందు టౌన్, జూన్ 18 (విజయక్రాంతి): ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) మరియు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సును విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, ఇల్లందు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బానోత్ హరిప్రియ నాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 21న ఆదివారం ఉదయం 9 గంటలకు ఇల్లందు పట్టణంలోని ఐతా ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీలు తాత మధుసూదన్, తక్కిళ్లపల్లి రవీందర్ రావు, జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు, సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్ చాడ కిషన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ తదితరులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 284 బూత్‌లకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు, సభ్యత్వ నమోదు సమన్వయకర్తలు, టౌన్, మండల పార్టీ అధ్యక్షులు, మహిళా, యువజన, అనుబంధ సంఘాల నాయకులు సమయపాలన పాటించి పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.






