ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రధాన లక్ష్యం : జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం/లక్ష్మీదేవిపల్లి,(విజయక్రాంతి): ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ రామవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన గ్రామ సభకు జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మార్చి 6వ తేదీ నుండి అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.
గ్రామ సభలు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను చేరవేసే సమర్థవంతమైన వేదికలన్నారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పంట మార్పిడి విధానాలను అనుసరించాలని, వ్యవసాయ శాఖ సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని సూచించారు. ఎరువులు, పురుగుమందుల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పంటల దిగుబడులు పెరిగేలా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ , మాలోత్ భారతి, ఎంపీడీఓ, జి.సుస్మిత మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






