calender_icon.png 6 February, 2026 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్

06-02-2026 12:36:28 AM

  1. ముఖాముఖి పోరులో పైచేయి ఎవరిది?
  2. రసవత్తరంగా మారిన షాద్ నగర్ మున్సిపల్ రాజకీయం 
  3. స్థానిక సమస్యల పైన నిలదీస్తున్న ఓటర్లు 

షాద్‌నగర్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): షాద్నగర్ మున్సిపాలిటీలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. ప్రధానంగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్  పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, పట్టు నిలుపుకోవాలని బిఆర్‌ఎస్ వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.ప్రధాన పార్టీల వ్యూహాలు, నేతల ప్రతిష్ట ఈ ఎన్నికలు ఇద్దరు కీలక నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.

వీర్లపల్లి శంకర్ (ఎమ్మెల్యే, కాంగ్రెస్) చుస్తే మున్సిపాలిటీపై పట్టు సాధించి, తన నాయకత్వాన్ని బలపరుచుకోవాలని శంకర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధికార బలం కాంగ్రెస్కు కలిసివచ్చే అంశం. అంజయ్య యాదవ్ (మాజీ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్) గతంలో తనకున్న పట్టును నిరూపించుకోవాలని, మున్సిపల్ పీఠాన్ని మరోసారి కైవసం చేసుకోవాలని అంజయ్య యాదవ్ ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్నారు.

వార్డుల వారీగా పోటీ ఇలా..

మొత్తం 28 వార్డుల్లో ప్రధాన పార్టీల బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి: మున్సిపల్ లో మొత్తం 28 వార్డుల్లోనూ అభ్యర్థులను నిలిపి గట్టి పోటీ ఇస్తున్నాయి.బిజెపి ఎన్నికలో 28 స్థానాలకు గాను 19 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను పోటీకి దింపింది.యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన బిజెపి, ఈ ఎన్నికల్లో బోణీ కొట్టాలని చూస్తోంది.

ఎంఐఎం పార్టీ ఒక వార్డులో పోటీ చేస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ జనరల్కు రిజర్వ్ కావడంతో, అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులకే పెద్దపీట వేశాయి.ఈసారి మహిళా అభ్యర్థులకు కూడా గణనీయమైన స్థానాలు లభించాయి. ముఖ్యంగా మాజీ మున్సిపల్ చైర్మన్ల సతీమణులు బరిలో ఉండటం విశేషం.  పాత ముఖాలకు దూరం గా ఉంచారు.

రెండు ప్రధాన పార్టీలు కొంతమంది మాజీ చైర్మన్లను, ప్రముఖ నేతలను పక్కన పెట్టడం ఆయా వార్డుల్లో గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరపున అందే మోహన్, విశాల విశ్వం వంటి వారు, బిఆర్‌ఎస్ తరపున నటరాజన్, వేణుగోపాల్ వంటి ప్రముఖులు రంగంలో ఉండి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలో సుమారు 50 వేల మందికి పైగా ఓటర్లు అభ్యర్థుల గెలుపు, ఓటములను తేల్చనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, ఈ ‘ముఖాముఖి‘ పోరులో విజేత ఎవరో వేచి చూడాలి.