13 August, 2026 | 3:14 PM

టెస్సరాక్ట్ సంస్థపై బీఆర్ఎస్ రాజకీయం

13-08-2026 02:03 PM

న్యూఢిల్లీ: ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Congress MP Chamala Kiran Kumar Reddy) మాట్లాడుతూ.... బీఆర్ఎస్ హయాంలో 54 కంపెనీలకు భూకేటాయింపులు జరిగాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎకరాకు రూ. 30 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు కేటాయించిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 కంపెనీలకు భూకేటాయింపులు జరిగాయని వివరించారు. ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో బీఆర్ఎస్ హయాంలో భూ కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరా రూ. 1.50 కోట్లకు కేటాయించిందని తెలిపారు. టెస్సరాక్ట్ సంస్థకు కేటాయించిన భూములపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ఎంపీ చామల ఆరోపించారు. తమకు 5 ఎకరాలు కావాలని టెక్స్ రాక్ట్ సంస్థ 2024లో దరఖాస్తు చేసుకుందని సూచించారు. సంవత్సరంపాటు పరిశీలించి టెస్సరాక్ట్ సంస్థకు 2025లో భూ కేటాయింపు జరిగిందన్న కాంగ్రెస్ ఎంపీ అందరికీ కేటాయించినట్లుగానే టెస్సరాక్ట్ సంస్థకు ఎకరా రూ. 1.50 కోట్ల చొప్పున కేటాయించామని పేర్కొన్నారు.

2025 వరకు టెస్సరాక్ట్ సంస్థకు కొండల్ రెడ్డి డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ కాదన్నారు. 2026 మార్చిలో టెస్సరాక్ట్ సంస్థ అడ్వైజరీ బోర్డు సలహాదారుడిగా కొండల్ రెడ్డి చేరారని చెప్పారు. టెస్సరాక్ట్ సంస్థ అడ్వైజరీ బోర్డు సలహాదారుడికి కంపెనీ కార్యకలాపాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. టెస్సరాక్ట్ సంస్థ గౌరవప్రదంగా పదవి ఇచ్చింది.. అంతమాత్రాన కంపెనీ కొండల్ రెడ్డిది అయిపోదని వ్యాఖ్యానించారు. టెస్సరాక్ట్ సంస్థలో రేవంత్ రెడ్డి సోదరుడి కొండల్ రెడ్డికి ఒక్క షేర్ కూడా లేదని ఎంపీ చామల వెల్లడించారు.