కాంగ్రెస్ నాయకులవి ప్రగల్భాలే.. అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే
- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు పద్మారెడ్డి
రూ. 14.44 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు, రూ. 6.86 కోట్లతో
కామేశ్వరాలయ పునర్నిర్మాణం
హనుమకొండ, ఏప్రిల్ 9 (విజయ క్రాంతి): చారిత్రక వరంగల్ మహానగర అస్తిత్వానికి ప్రతీక అయిన వెయ్యిస్తంభాల గుడి (రుద్రేశ్వరాలయం) పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో విడత భారీ నిధులను మంజూరు చేయడంపై బీజేపీ నాయకురాలు రావు పద్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఓరుగల్లు అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ నిధుల మంజూరుతో మరోసారి స్పష్టమైందని అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా బిజెపి నాయకులతో కలిసి రావు పద్మ ఇటీవల మంజూరైన రూపాయలు 14.40 కోట్ల తో చేపట్టనున్న అభివృధి పనులు పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి అసంపూర్తిగా ఉన్న వెయ్యిస్తంభాల గుడి కళ్యాణ మండప పునర్నిర్మాణ పనులను పూర్తి చేయడానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారని, గతంలో పురావస్తు శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూపాయలు 17 కోట్లు కేటాయించి, పనులను పూర్తి చేయించి జాతికి అంకితం ఇచ్చారన్నారు.
గత ఏడాది హైదరాబాద్లో కిషన్ రెడ్డి ని కలిసి ఆలయంలోని మరికొన్ని అసంపూర్తి పనులను వారి దృష్టికి తీసుకువెళ్లాడం జరిగిందని, ఇటీవల కిషన్ రెడ్డి హనుమకొండ పర్యటనకు వచ్చినప్పుడు ఆలయ ప్రాంగణంలో సమీక్ష నిర్వహించి, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి ప్రతిపాదనలు పంపారని, అందుకు స్పందించిన కేంద్రం, ఆలయ అభివృద్ధి పనుల కోసం రూపాయలు 14.44 కోట్లు, కామేశ్వరాలయ పునర్నిర్మాణానికి రూపాయలు 6.86 కోట్లు మంజూరు చేసిందని, 20 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఓరుగల్లు వారసత్వాన్ని కాపాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ కి, కిషన్ రెడ్డి కి, గజేంద్ర సింగ్ షెకావత్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు.
‘పెళ్లైన, చావైనా’ నేనే డాన్స్ వేస్తా అన్నట్లుగా ప్రతి చిన్న విషయానికి క్రెడిట్ కొట్టేయాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనైనా, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలోనైనా అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే అన్నది వాస్తవంఅని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలు మానుకుని, కేంద్రం ఇస్తున్న నిధులను సద్వినియోగం చేయాలి, అని ఆమె హితవు పలికారు. ఈ కార్యక్రమాలలో బిజెపి రాష్ట్ర నాయకులు దొంతి దేవేందర్ రెడ్డి, పులి సర్రొత్తం రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి సండ్ర మధు, జిల్లా నాయకులు బైరి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




