ఎస్ఎన్‌డీపీ అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించాలి
అధికారులను ఆదేశించిన మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
బోడుప్పల్ సర్కిల్‌లో పర్యటనలో సమస్యలను తెలుసుకున్న కమిషనర్
మేడిపల్లి,(విజయక్రాంతి): గతంలో స్టాండింగ్ కమిటీ ఆమోదించిన రూ.96 కోట్ల ఎస్ఎన్‌డీపీ అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని న్యూ శ్రీ సాయినగర్ కాలనీని సందర్శించారు. శ్రీ సాయినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సమస్యలను వివరించారు. కాంట్రాక్టర్ పనులు చేపట్టకపోతే రీ-టెండర్ చేయడానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు.
అనూ టెక్స్ కమర్షియల్ కాంప్లెక్స్ వెనుక రోడ్డుపై ట్రాన్స్‌ఫార్మర్లను యజమానుల స్థలాల్లోకి తరలించేలా నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. కమర్షియల్ భవనాల్లో సెల్లార్ పార్కింగ్ ప్రదేశాలను కమర్షియల్ గా వాడుతున్నట్లయితే వెంటనే ఖాళీ చేసి పార్కింగ్ కోసం మాత్రమే ఉపయోగించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలన్నారు. రహదారులు ఇరుకుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట రోడ్లను విస్తరించాలని ఆదేశించారు.
తాగునీటి పైప్ లైన్ లీకేజీలపై ఫిర్యాదులు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరిత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలనీలో సీనియర్ సిటిజన్ల కోసం ఓపెన్ ప్లేస్ లో నిర్మాణానికి అనుమతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ మరియు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసి పార్కింగ్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్లాన్టర్ బాక్స్‌లలో మొక్కలు లేని చోట వెంటనే మొక్కలు నాటాలని, అవసరమైతే ప్లాన్టర్ బాక్స్‌లను తొలగించి రోడ్ విస్తరణ చేపట్టాలని ఆదేశించారు.
కాలనీలోని వ్యాపార సముదాయాల్లో ట్రేడ్ లైసెన్సులు రెన్యువల్ కాలేదని గుర్తించి, ప్రతి దుకాణదారునికి నోటీసులు జారీ చేసి ఈ వారంలోనే లైసెన్సులు రెన్యువల్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్షరా స్కూల్ సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. దోమల నివారణ చర్యల్లో భాగంగా ఫాగింగ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి,అన్ని కాలనీలను కవర్ అయ్యేలా నిరంతర ఫాగింగ్ నిర్వహించాలని ఆదేశించారు.






