నిత్యావసరాల అక్రమ నిల్వ.. హత్యానేరం కంటే ఎక్కువ
ఈగల్, హైడ్రా తరహాలో.. ఆహార కల్తీ నియంత్రణకు కొత్త వ్యవస్థ
సన్నబియ్యం పంపిణీతో.. బ్లాక్ మార్కెట్ మాఫియా తగ్గింది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్
హైదరాబాద్: ఎక్కడైనా ఉత్పత్తిదారుడే వస్తువు ధరను నిర్ణయిస్తారని, కానీ ఒక రైతు పండించిన పంటకు మాత్రం ఆ అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈగల్, హైడ్రా తరహాలో ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ తీసుకొస్తామని స్పష్టం చేశారు. దేశంలోని చట్టాలను అధ్యయనం చేసిన పకడ్బందీ వ్యవస్థ తీసుకొస్తామన్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీ చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల హక్కులను కాపాడేందుకు కనీస మద్దతు ధర చట్టం తెచ్చామని పేర్కొన్నారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే ఎక్కువన్నారు. ప్రజల ఆకలిని సొమ్ము చేసుకునే వాళ్ళను నియంత్రించడానికి ఆనాడు కాంగ్రెస్ పకడ్బందీ చట్టం తీసుకొచ్చిందని గుర్తుచేశారు.
విజయభాస్కర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి కిలో బియ్యం పథకం ప్రారంభించిందని, కాకపోతే అది అంతగా ప్రజల్లోకి వెళ్లలేదని సీఎం పేర్కొన్నారు. ఆ తరువాత ఎన్టీరామారావు ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. రేషన్ బియ్యం పంపిణీపై ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని, నలభై ఏళ్లుగా ఇదే పథకం కొనసాగుతోందన్నారు. ఆనాటి నుంచి దొడ్డు బియ్యమే ఇస్తూ వచ్చారని వివరించారు.దొడ్డు బియ్యం తినేవారు లేక ఆ బియ్యాన్ని సన్ననియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయిందని సూచించారు.
దొడ్డు బియ్యాన్ని ప్రజలకు ఇవ్వడం ప్రభుత్వానికి ఖర్చు తప్ప, పేదలకు ఉపయోగపడటం లేదని గ్రహించామన్న సీఎం రేవంత్ రెడ్డి అందుకే పేదలకు తినగలిగే సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించి సన్నబియ్యం పథకం ప్రారంభించామని పేర్కొన్నారు. ఇందుకోసం రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ అందించి సన్నవడ్లు పండించాలని ప్రోత్సహించామని తెలిపారు. పౌరసరఫరాల మంత్రి, శాఖ సిబ్బంది నిరంతర పర్యవేక్షణతో సన్నబియ్యం పంపిణీతో బ్లాక్ మార్కెట్ మాఫియా తగ్గిందని పేర్కొన్నారు. నేటితో సన్నబియ్యం పంపిణీకి ఏడాది పూర్తయిందని హర్షం వ్యక్తం చేశారు.




