5 May, 2026 | 3:51 AM

ఢిల్లీతో చెన్నై బిగ్‌ఫైట్

05-05-2026 02:34 AM

ఇరు జట్లకూ కీలక మ్యాచ్

సీఎస్కేకు గాయాల బెడద

ఢిల్లీ, మే 4 : ఐపీఎల్ 19వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరో కీలకపోరుకు సిద్ధమైంది. ఆరంభంలో తడబడి తర్వాత పుంజుకున్న సీఎస్కే ఇప్పుడు ప్లే ఆఫ్ అవకాశాలపై ఆశలు పెట్టుకుంది. గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను ఓడించిన తర్వాత చెన్నై కాన్ఫిడెన్స్ పెరిగింది.ప్రస్తుతం సీఎస్కే 9 మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది.

కీలక ఆటగాళ్ల గాయా లు ఇబ్బంది పెడుతున్నా సెకండాఫ్‌లో చెన్నై బాగానే పుంజుకుంది. సంజూ శాంసన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆ జట్టుకు కలిసొచ్చే అంశా లు. గత మ్యాచ్‌లో రుతురాజ్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు.

వరుసగా రెండు మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలతో ఫామ్ అందుకున్న రుతురాజ్‌కు తోడు మిగిలిన బ్యాటర్లు కూడా రాణిస్తే చెన్నై భారీస్కోరు సాధించొచ్చు. ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, బ్రెవిస్ వంటి హిట్టర్లపై అంచనాలున్నాయి. అయితే శివమ్ దూబే తన ఫినిషర్ రోల్‌కు న్యాయం చేయలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో దూబే పెద్దగా ఆడింది లేదు. దీంతో ఢిల్లీతో మ్యాచ్‌లోనైనా అతను ఫామ్ లోకి రావాలని సీఎస్కే మేనేజ్ మెంట్ కోరుకుంటోంది. అటు బౌలింగ్‌లో ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ నిలకడగా రాణిస్తున్నారు.

అతనితో పాటు స్పిన్నర్ నూర్ అహ్మద్ సత్తా చాటుతున్నాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ప్రస్తుతం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై అదిరిపోయే విజయాన్ని అందుకుంది. అది కూడా 226 పరుగుల భారీటార్గెట్‌ను ఛేదించింది. నిస్సాం క, రాహుల్, స్టబ్స్ , నితీష్ రాణా ఇలా కీలక బ్యాటర్లందరూ ఫామ్‌లోకి వచ్చారు. దీంతో బ్యాటింగ్ పరంగా ఢిల్లీకి ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు.

వీరిలో ఏ ముగ్గురు రాణించినా కూడా ఢిల్లీ ఎలాంటి టార్గెట్‌నైనా ఛేదిస్తుంది. బౌలింగ్‌లో మిఛెల్ స్టార్క్ జట్టులోకి తిరిగి రావడం ఢిల్లీ బలాన్ని పెంచింది. వచ్చీ రావడంతోనే ఆకట్టుకున్న స్టార్క్ తో పాటు కైల్ జేమీసన్ , నటరాజన్ కూడా పర్వాలేదనిపిస్తున్నారు. అయితే కుల్దీప్, అక్షర్ పటేల్ స్పిన్ మ్యాజిక్ ఇంకా పూర్తిస్థాయిలో చూపించడం లేదు. గత రికార్డుల పరంగా చూస్తే చెన్నైదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 32 సార్లు తలపడితే చెన్నై 20 మ్యాచ్‌లలో గెలిచింది. ఇక ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని అంచనా.

తుది జట్లు అంచనా:

ఢిల్లీ క్యాపిటల్స్ : నిస్సాంక, కేఎల్ రాహుల్, నితీశ్ రాణా, స్టబ్స్, అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), కైల్ జేమీసన్, స్టార్క్, కుల్దీప్, నటరాజన్

చెన్నై సూపర్‌కింగ్స్: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, బ్రెవిస్, శివమ్ దూబే, ఓవర్టన్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముకేశ్ చౌదరి