దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్
భూమి దక్కితేనే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మిన సిద్ధాంతకర్త
ప్రజా ఉద్యమాల నిర్మాణమే రాజేశ్వర్ రావుకు ఇచ్చే ఘనమైన నివాళి
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టి నిరుపేదల జీవనోపాధి కల్పించిన చండ్ర రాజేశ్వర్ రావు చిరస్మరణీయుడని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కమ్యూనిస్టు పార్టీ పితామహుడు చండ్ర రాజేశ్వర్ రావు వర్ధంతిని గురువారం కొత్తగూడెంలోని శేషగిరి భవన్‌లో ఘనంగా నిర్వహించారు. తొలుత సిఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ.. జమీందారీ కుటుంబంలో జన్మించిన రాజేశ్వర్ రావు, కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై తన యావదాస్తిని పేదలకు పంపిణీ చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
మహిళలపై దాడులు, అరాచకాలను అరికట్టేందుకు, ఉద్యమాలను అణచివేసే ప్రభుత్వాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆరు దశాబ్దాల క్రితమే ఆయన 'జనసేవాదళ్'ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సుదీర్ఘకాలం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ, అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడిపి నిరాడంబరతకు మారుపేరుగా సిఆర్ నిలిచారన్నారు. నేటి రాజకీయ వాతావరణంలో ఆయన విలువలు, క్రమశిక్షణ ఎంతో అవసరమని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహించడమే ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళి అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ కె ఫహీమ్, జిల్లా సమితి సభ్యులు వంగ వెంకట్, రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.




