3 September, 2026 | 1:06 PM

బైక్‌ను తప్పించబోయి షాపులోకి దూసుకెళ్లిన కారు

03-09-2026 | 12:17pm

బోధన్, సెప్టెంబర్ 03(విజయక్రాంతి): బోధన్‌ పట్టణంలోని అంబేద్కర్‌ కాలనీ చౌరస్తా(Ambedkar Colony Junction) వద్ద గురువారం రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. బండారుపల్లి గ్రామం వైపు నుంచి వస్తున్న ఓ బైక్‌ను తప్పించబోయిన TS 15 FL 013 నంబర్‌ గల కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న మంగళ్‌ షాపులోకి దూసుకెళ్లింది. కారు వేగంగా షాపులోకి దూసుకెళ్లడంతో వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతిని నుజ్జునుజ్జయింది.

ప్రమాద సమయంలో కారులో ఉన్న వ్యక్తులకు గాయాలు కావడంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి(Bodhan Government Hospital) తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. బైక్‌ను తప్పించుకునే క్రమంలోనే కారు అదుపుతప్పిందా, లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయంపై పోలీసులు(Police) విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, గాయపడిన వారి పరిస్థితి తెలియాల్సి ఉంది.