ప్రభుత్వ నిర్వహణ లోపం.. రూ. కోట్ల నష్టం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై 'కాగ్' సంచలన నివేదిక
2019-20,2020-21 బడ్జెట్ సక్రమంగా లేదు
జీహెచ్ఎంసీపై కాగ్ కీలక ఆరోపణలు
తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలపై ''కాగ్'' కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: మార్చి 2022తో ముగిసిన ఏడాదికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ కాగ్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టింది. సామాజిక, ఆర్థిక, భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, సాధారణ రంగాలపై కాగ్ నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ నిర్వహణ లోపంతో రూ. కోట్ల నష్టం వచ్చిందని కాగ్ నివేదిక వెల్లడించింది. 2019-20,2020-21 బడ్జెట్ సక్రమంగా లేదని కాగ్ రిపోర్టు తేల్చిచెప్పింది.
2021-2022 బడ్జెట్ నిధుల కేటాయింపు, రాబడుల మధ్య 53 శాతం వ్యత్యాసం ఉందని పేర్కొంది. బ్యాంకులతో సమన్వయం , పర్యవేక్షణ లోపంతో ప్రజాధనం వృథా అయిందని సూచించింది. 2023 నాటికి చెక్కులు, డ్రాఫ్ట్ లు జమ చేయనందున రూ, 52 కోట్ల నష్టం జరిగింది. జీహెచ్ఎంసీపై కాగ్ కీలక ఆరోపణలు చేసింది. ప్రాసెస్ చేయని చెత్తకు రూ. 313.20 కోట్ల చెల్లింపులు జరిగాయి. డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ జరగకపోయినా కాంట్రాక్టర్ కు చెల్లింపులు చేశారు. యూజర్ ఛార్జీల సేకరణపై సమీక్ష లేదని తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలపై కాగ్ నివేదిక
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలపై కాగ్ నివేదిక విడుదల చేసింది. 2023 మార్చి వరకు ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై కాగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నట్లు కాగ్ నివేదిక రిపోర్టు ఇచ్చింది. 16 సంస్థలు మూత లేదా లిక్విడేషన్ లో ఉన్నట్లు కాగ్ వెల్లడించింది. పనిచేస్తున్న 67 సంస్థల్లో 49 సంస్థల ఖాతాల సమర్పణలో ఆలస్యం జరిగినట్లు కాగ్ తెలిపింది. కేవలం 18 సంస్థల పనితీరే విశ్లేషణకు తీసుకున్నట్లు కాగ్ స్పష్టం చేసింది. 18 సంస్థల టర్నోవర్ రూ. 95,204 కోట్లుగా ఉందని కాగ్ సూచించింది.
18 సంస్థల్లో 11 నష్టాల్లో, 6 సంస్థలు లాభాల్లో ఉన్నట్లు కాగ్ పేర్కొంది. మొత్తం పెట్టుబడులు రూ. 98,572 కోట్లుగా నమోదైనట్లు కాగ్ వెల్లడించింది. నష్టాలతో తొమ్మిది సంస్థల నికర విలువ పూర్తిగా తగ్గినట్లు కాగ్ తెలిపింది. మొత్తం నికర విలువలో రూ. 50,930 కోట్లు తగ్గుదల ఉన్నట్లు వివరించింది. 71 సంస్థలు సమయానికి ఖాతాలు సమర్పించలేదని కాగ్ పేర్కొంది. 15 సంస్థల్లో 9 సంస్థలు స్వతంత్ర డైరెక్టర్లను నియమించలేదు, ఎక్కడా స్వతంత్ర డైరెక్టర్లు సమావేశాలు నిర్వహించలేదని వివరించింది. ఐదు సంస్థల్లో ఆడిట్ కమిటీ లేకపోవడం గమనార్హం, 9 సంస్థల్లో ఎన్ఆర్ సీ కమిటీ ఏర్పాటు కాలేదని కాగ్ తెలిపింది.




