కాక్రోజ్... దేశ ద్రోహుల పార్టీ
నీట్ పేరుతో దేశ వ్యతిరేక కలాపాలు
ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజల్ని రెచ్చగొడుతున్నారు..
రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం
అడ్డుకున్న పోలీ సులు, చోటు చేసుకున్న ఉద్రిక్తత
నిజామాబాద్, జూలై 22 (విజయక్రాంతి): కాక్రోజ్ పార్టీ, దానికి మద్దతు తెలుపుతున్న పార్టీలు, నాయకులు దేశద్రోహ కార్యకలాపాలకు అండగా ఉన్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త ధ్వజమెత్తారు. ప్రధాని నివాసం వద్ద అరాచకం సృష్టించిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బుధవారం నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త మాట్లాడుతూ.. కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఒకప్పుడు ఆప్ పార్టీ సోషల్ మీడియా వాలంటీర్ గా పని చేశాడని గుర్తు చేశారు.
ఒకవైపు ప్రపంచ దేశాల్లో భారత్ ఆగ్రహానికి నిలబడితే, కాంగ్రెస్ మాత్రం అధికారం కోసం అరాచక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. దేశ ప్రధాని మోదీ అభివృద్ధి పాలన చూడలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలుపుతున్న నాయకులంతా దేశద్రోహులేనని ధ్వజమెత్తారు. దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్ చుగ్ గతంలో జాతీయ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టడంతో, ఆయనపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదయిందని తెలిపారు.
కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ బంగ్లాదేశ్ కి పాకిస్తాన్ కి మద్దతు తెలుపుతూ దేశ వ్యతిరేకులుగా మిగిలిపోతున్నారన్నారు. మమతా బెనర్జీ, స్టాలిన్, అద్దంకి దయాకర్, ప్రకాష్ రాజ్.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది హిందూ వ్యతిరేకులు ఏకమవుతున్నారని చెప్పారు. నీట్ పరీక్ష పేరుతో ఢిల్లీలో అరాచకం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నీట్ లీకేజీ పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు.
విద్యార్థుల పాఠ్యాంశాల్లో అక్బర్, ఔరంగజేబు వంటి వారి చరిత్రను తొలగించినందుకా అని అన్నారు. అంతకు ముందు పోలీసులు దిష్టి బొమ్మ దహనాన్ని అడ్డుకోవడంతో కొంత తోపులాట జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కార్ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ, ఎర్రం సుధీర్, ఇప్పకాయల కిషోర్, చింతకాయల రాజేందర్, బెల్లాల్ శశాంక్, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, న్యాలం సునీత రాజు, బంటు ప్రీతి ప్రవీణ్, మండలాధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






