15 July, 2026 | 10:08 AM

కూతురి వివాహం విచ్ఛిన్నం కావడంతో కక్ష! మాదాపూర్‌లో వరంగల్ యువకుడి దారుణ హత్య

15-07-2026 09:58 AM

పాత ప్రేమ వ్యవహారమే కారణం,పరారీలో ఐదుగురు నిందితులు

శేరిలింగంపల్లి,జూలై 15 (విజయక్రాంతి): హైదరాబాద్ ఐటీ హబ్(Hyderabad's IT hub) మాదాపూర్‌లో పాత కక్షలు రక్తపాతంగా ముగిశాయి. కూతురి దాంపత్య జీవితం విచ్ఛిన్నం కావడానికి తానే కారణమని భావించిన వ్యక్తులు, ఓ యువకుడిని హాస్టల్ వద్దకు పిలిచి కిరాతకంగా కత్తులతో నరికి చంపారు. మంగళవారం రాత్రి అయ్యప్ప సొసైటీలో జరిగిన ఈ ఘాతుకం స్థానికులను తీవ్రంగా కలవరపెట్టింది.మృతుడు చిన్నపల్లి భాస్కర్ (30) వరంగల్ జిల్లా(Warangal District) మదన్నపేట్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ నగరంలోని అయ్యప్ప సొసైటీలో హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో తన స్వగ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు.

కులాంతర ప్రేమ కావడంతో ఆమె కుటుంబం వారు ఈ సంబంధాన్ని నిరాకరించారు. మూడేళ్ల క్రితం ఆ యువతికి వేరొక వ్యక్తితో వివాహం జరిపించారు.అయితే పెళ్లి అయిన కొద్ది రోజులకే దంపతుల మధ్య విభేదాలు తలెత్తి విడాకులు వచ్చాయి. దీంతో తమ కూతురు కాపురం నాశనం కావడానికి భాస్కర్‌  కారణమని యువతి తండ్రి రాజు కుటుంబ సభ్యులు తీవ్ర కక్ష పెంచుకున్నారు. గతంలోనూ భాస్కర్‌ను చంపేస్తామని బెదిరింపులు చేశారు.

ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి ఐదుగురు వ్యక్తులు పక్కా ప్లాన్‌తో హాస్టల్ వద్దకు చేరుకున్నారు. మాట్లాడాలని చెప్పి భాస్కర్‌ను బయటకు పిలిచి, విచక్షణ లేకుండా కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో భాస్కర్ అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచాడు.మృతుడి సోదరుడు చిన్నపల్లి మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.