29 March, 2026 | 1:42 PM

గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

29-03-2026 12:01 PM

హైదరాబాద్: రాఘవ కన్ స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉన్న గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మాట్లాడుతూ... మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి చెందిన మైనింగ్ సంస్థ గత రెండేండ్ల నుండి ఇల్లీగల్ మైనింగ్(Illegal mining) చేస్తూ, ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతూ వందల కోట్ల రూపాయల సొమ్మును పోగు చేసుకుందని ఆరోపించారు.

మైనింగ్ శాఖ పెంచిన ఫీజుల ప్రకారం.. ఈ ప్రభుత్వానికి రూ.1800 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా… వచ్చింది. కానీ కేవలం రూ.900 కోట్లు మాత్రమే చూపిస్తున్నారని, మిగిలిన రూ.900 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? అని ప్రశ్నించారు. సభా సంఘం వేసి ప్రభుత్వంలోని దండుపాళ్యం బ్యాచ్ పాత్ర గురించి విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

మెట్రో టేకోవర్‌పై అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఎల్&టీ అనే ప్రైవేట్ కంపెనీకి ఉన్న రూ.15 వేల కోట్ల అప్పును తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా రుద్దుతోందని విమర్శించారు. వేల కోట్ల సంపదను దోచుకోవడానికి, ఎల్&టీ కంపెనీ సీఎఫ్ఓను జైలులో వేస్తామని బెదిరిస్తూ, మేడిగడ్డ బ్యారేజీ విషయంలో తాను చెప్పిన మాట వినడం లేదని కాంగ్రెస్ గూండాలు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. ఎల్&టీ కంపెనీకి లీజుకిచ్చిన రూ.22 వేల కోట్ల విలువైన 280 ఎకరాల భూమిని కొట్టేయడానికి కాంగ్రెస్ దండుపాళ్యం బ్యాచ్ కుట్రకు తెరలేపిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.