బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్
బాన్సువాడ, ఆగస్టు 23 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా దామరంచ గ్రామ సర్పంచ్ బోయిని శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం రైతునగర్‌లోని సామూహిక కళ్యాణ మండపంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.మండల సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షురాలిగా కిష్టాపూర్ సర్పంచ్ బాన్సువాడ మాణేవ్వ, ప్రధాన కార్యదర్శిగా తిమ్మాపూర్ తండా సర్పంచ్ దేవి సింగ్‌ను సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బోయిని శంకర్ మాట్లాడుతూ.. మండలంలోని సర్పంచుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, నిజామాబాద్ డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిల సహకారంతో సర్పంచుల సమస్యలను ఉన్నతస్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.అనంతరం నూతనంగా ఎన్నికైన బీర్కూర్ మండల సర్పంచుల సంఘం కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.






