23 August, 2026 | 8:33 PM

కొత్తపల్లిలో ఘనంగా ఖండ యువ సమ్మేళనం

23-08-2026 07:43 PM

 కొత్తపల్లి, ఆగస్టు 23(విజయక్రాంతి): కొత్తపల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ రామాలయంలో కొత్తపల్లి ఖండ యువ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో యువ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువకులు, ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ముత్తునూరి హరీష్  రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్న యువకులు అదృష్టవంతులని, ఈ సమ్మేళనం ద్వారా దేశ పునర్నిర్మాణంలో వారు క్రియాశీలక భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా, స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని దేశం గురించి ఆలోచించే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

చిన్న చిన్న విషయాలకు క్షణికావేశంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చేసే సమాజ కార్యంలో యువత ప్రతిరోజూ కనీసం గంట సమయం కేటాయించాలని కోరారు. సంఘ స్వయంసేవకులు తమ కుటుంబాలను చూసుకుంటూ, ఉద్యోగాలు చేస్తూనే సమాజ కార్యంలో భాగస్వాములు అవుతున్నారని, పూర్తి సమయం కేటాయించి ప్రచారకులుగా కూడా సేవలు అందిస్తున్నారని తెలిపారు.భారత రాజ్యాంగాన్ని గౌరవించి పౌరులు పాటించవలసిన నియమాలను విధిగా పాటించాలని సూచించారు. ప్రపంచ దేశాలన్నింటికంటే మన భారతదేశంలోనే యువశక్తి ఎక్కువగా ఉందని, మనం చేసే ప్రతి ఆలోచన దేశంపై, ప్రపంచంపై ప్రభావం చూపుతుందని , ఐక్యతతో ఉండి సమాజ హితం కోసం ధర్మ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కొత్తపల్లి ఖండ కార్యవాహ దీకొండ అన్వేష్ అంజన్న, ఖండ సహ కార్యవాహ ఎన్నం సురేందర్, గ్రామ వికాస ప్రముఖ్‌ చిట్కూరి శ్రీనివాస్, శారీరక ప్రముఖ్‌ ఆవుల శివశంకర్, ఖండ కళాశాల విద్యార్థి ప్రముఖ్ పెద్ది శ్రీధర్, బండ కిషన్ రెడ్డి, స్వర్గం సురేంద్రనాథ్, అలాగే పెద్ద సంఖ్యలో యువత , స్వయం సేవకులు పాల్గొన్నారు.