సుప్రీంకోర్టు స్టే: కరూర్ బాధితులకు భారీ ఊరట
చెన్నై: గత ఏడాది కరూర్ తొక్కిసలాటలో(Karur Victims) మరణించిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు(Madras High Court) ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఇలాంటి విషాద ఘటనలకు గురైన కుటుంబాలకు ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాలు కల్పించకూడదని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. బాధితుల కుటుంబ సభ్యులకు కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పిస్తూ జారీ చేసిన విజయ్ ప్రభుత్వ(Vijay Government) ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు జూలై 27న రద్దు చేసింది. భారీ విషాదాన్ని ఎదుర్కొన్న కుటుంబాలకు కొంత ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు రావడంలో తప్పేముంది? అని జస్టిస్ జె.బి. పర్దీవాలా ప్రశ్నించారు.
దీనిలోకి రాజకీయాలను తీసుకురావద్దు, తొక్కిసలాట జరిగి చాలామంది మరణించారు. ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, దాన్ని వ్యతిరేకించడానికి ఇతరులు ఎవరు? ఆ తొక్కిసలాటలో కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి మరణించి ఉంటే, ఆ కుటుంబంలో సంపాదించేవారు ఎవరూ లేనప్పుడు... వారి విద్యార్హతలకు అనుగుణంగా కుమారుడికో, కుమార్తెకో లేదా భార్యకో ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకూడదా? అని జస్టిస్ పార్దీవాలా(Justice Pardiwala) వ్యాఖ్యానించారు. అనేక కుటుంబాలలో ఇంటికి ఏకైక ఆధారం ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రసంగించిన 'తమిళగ వెట్రి కజగం' (Tamilaga Vettri Kazhagam) రోడ్‌షో సందర్భంగా, 2025 సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో మొత్తం 41 మంది మరణించగా, సుమారు 100 మంది గాయపడిన విషయం తెలిసిందే.






