16 May, 2026 | 2:51 PM

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

16-05-2026 02:00 PM

మండల న్యాయ సేవా సదస్సులో జడ్జి ఎండి. గౌస్ పాషా 

తుంగతుర్తి,(విజయక్రాంతి): ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మానవత్వంతో ఆదరిస్తూ, ఓర్పుతో మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రతి వైద్య సిబ్బంది బాధ్యత అని తుంగతుర్తి జూనియర్ కోర్టు సివిల్ జడ్జి ఎండి గౌస్ పాషా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. వైద్య సేవల కోసం వచ్చే రోగులకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన సలహాలు సూచనలను వారికి వివరించాలని తెలిపారు.

రోగుల యొక్క వివరాలను గోప్యంగా ఉంచాలని వారి యొక్క మానవ విలువలకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. వైద్య సేవలు అందించే సమయంలో ఎవరైనా విధులకు ఆటంకం కలిగిస్తే చట్టాలు ఉన్నాయి అని వైద్య సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి వస్తే పరిష్కరిస్తామని తెలిపారు. అంతకుముందు ఆస్పత్రిలోని ఓపి రిజిస్టర్ పరిశీలించి, గదులను కలియ తిరుగుతూ మందులు, పరీక్ష ల్యాబ్ ను పరిశీలించి స్వయంగా రోగులతో ఆప్యాయంగా మాట్లాడుతూ అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు  అనేపర్తి జ్ఞాన సుందర్, తుంగతుర్తి ఇన్చార్జి సీఐ నాగేశ్వరరావు, ఎస్సై క్రాంతి కుమార్, న్యాయవాదులు, సీనియర్ సిస్టర్ నాగమణి, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.