స్క్రీన్ వెనుక..
సినిమా.. రెండున్నర గంటల వినోదం.
ప్రేక్షకులకు వినోదం పంచేందుకు తెరపై ప్రదర్శించే సన్నివేశాల సమాహారం. ఒక రెండున్నర గంటల సినిమా తెరపైకి తీసుకొచ్చేందుకు తెర వెనుక ఎంతో మంది కష్టపడాల్సి ఉంటుంది. ఎంతో కాలం పనిచేయాల్సి వస్తుంది. అంటే, సినిమా వెనుక సినిమా ఉంటుంది! ప్రేక్షకులు తెరపై చూసే ఆ కథలను రాసే దగ్గరి నుంచి స్క్రీన్ వెనుక జరిగే రియల్ సీన్స్ ఎంతో ఆసక్తిగా ఉంటాయి. ప్రపంచం కుగ్రామంగా మారిన ఈరోజుల్లో సినిమా కష్టాలు ఇంకా అలాగే ఉన్నాయా..? ఈ ఆధునిక సినీ ప్రపంచంలో స్క్రీన్ వెనుక ఏం జరుగుతోంది?!
సినిమా కేవలం ఒక కళ మాత్రమే కాదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండే పరిశ్రమ. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకున్నవారే ఇక్కడ నిలబడతారు. సాంకేతికతను అనుసరిస్తూ సినిమా మేకింగ్‌లోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులు కేవలం సాంకేతికం మాత్రమే కాక, ఒక కొత్త ఆర్ధిక వ్యవస్థను కూడా నిర్మిస్తున్నాయి. సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవ డంలో తెలుగు చిత్రపరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది.
మేకింగ్ పరంగా టాలీవుడ్‌లోనూ ఎన్నో మార్పులు జరిగాయి. టాలీవుడ్ మేక ర్స్‌ను విజేతలుగా నిలబెడుతున్నది ముఖ్యంగా నాలుగు అంశాలే. రైటర్స్ రూమ్ సంస్కృతి, వర్చువల్ ప్రొడక్షన్‌ఎల్‌ఈడీ వాల్స్, ఏఐ, బాక్సాఫీస్ లెక్కలు ఇవే తెలుగు సినిమా విజయ రహస్యం. కాలానుగుణంగా కొంగొ త్త పద్ధతులను అనుసరిస్తూ అంతర్జాతీయ వేదికలపై తెలుగోడి సత్తాను చాటుతున్నారు మన మేకర్స్.
కథకు బలం చేకూర్చుతున్న ‘రైటర్స్ రూమ్’
ఒకప్పుడు డైరెక్టర్ చెబితే అసిస్టెంట్ డైరెక్టర్లు రాసేవారు. ఇప్పుడు హాలీవుడ్ స్టైల్‌లో ‘డెమోక్రటిక్’ రైటింగ్ మొదలైంది. దర్శకుడు ఒక్కడే కూర్చుని కథ రాసుకునే పద్ధతి మన దగ్గర క్రమంగా మారుతోంది. వెబ్ సిరీస్‌ల ప్రభావంతో నలుగురైదుగురు రైటర్స్ కలిసి పనిచేసే ‘రైటర్స్ రూమ్’ సంస్కృతి టాలీవుడ్‌లో వేళ్లూనుకుంటోంది. దీనివల్ల కథల్లో వైవిధ్యం వస్తోంది. కొంత మంది రచయితలు ఒక గదిలో కూర్చుని ప్రతి స్పీ చర్చించి, విమర్శించుకుని స్క్రిప్టును మెరుగుపరుస్తారు.
దీనివల్ల కథలో లాజిక్ మిస్ అవ్వదు. ఇది డైరెక్టర్‌పై ఒత్తిడిని తగ్గించి, క్రియేటివిటీని పెంచుతోంది. అంతేకాక స్క్రిప్ట్ రాసేటప్పుడు ‘స్క్రిప్ట్ బుక్’ వంటి ఏఐ టూల్స్ ఉపయోగిస్తున్నారు. దాంతో కథలో ఎక్కడ ల్యాగ్ ఉంది, ఏ సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్ కొడతాయనేది విశ్లేషించుకుంటున్నారు.
‘దూత’, ‘రానా నాయుడు’ వంటి సిరీస్‌ల సక్సెస్ వెనుక ఈ రైటర్స్ రూమ్ టీమ్ వర్క్ ఉంది. ఈ రైటర్స్ రూమ్ సంస్కృతి వెబ్ సిరీస్ నుంచి బిగ్ స్క్రీన్‌కు పాకింది. ఇటీవల పెద్ద హీరోల సినిమాలు కూడా ఇద్దరు ముగ్గురు రచయితల సమన్వయంతోనే పట్టాలెక్కుతున్నాయి. ఈ కారణంగా టాలీవుడ్‌లో ఇప్పుడు కేవలం డైరెక్టర్లకే కాకుండా షో రన్నర్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది.
బాక్సాఫీస్ లెక్కలు మార్చేస్తున్న ఓటీటీ
ఇప్పుడు కేవలం థియేటర్ కలెక్షన్స్ మాత్రమే సినిమా సక్సెస్‌ను నిర్ణయించడంలేదు. అందుకే సినిమా అంటే కేవలం థియేటర్ కలెక్షన్స్ మాత్రమే అనే భావన పోయింది. నాన్-థియేట్రికల్ రెవెన్యూ కింగ్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు కొత్త బిజినెస్ మోడల్స్‌ను అనుసరిస్తున్నారు. ఓటీటీ డీల్స్, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ వంటివన్నీ సినిమా విడుదలకు ముందే జరిగిపోతున్నాయి. తద్వారా సినిమా బడ్జెట్‌లో 60- నుంచి 80% రికవరీ అయిపోయి, మేకర్స్ టేబుల్ ప్రాఫిట్ సాధిస్తున్నారు.
కంటెంట్ నాణ్యత తగ్గితే ఓటీటీలు వెనక్కి తగ్గుతున్న సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి సంస్థలు భారీ రేట్లు చెల్లిస్తూ, ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిర్మాతలు ‘విండోయింగ్’ వంటి బిజినెస్ స్ట్రాటజీని అనుసరిస్తున్నారు. పెద్ద సినిమాలకు థియేటర్‌కు ఓటీటీకి మధ్య సమయం పెంచడం ద్వారా థియేటర్ ఆదాయాన్ని కాపాడుకుంటూనే, డిజిటల్ రైట్స్ ద్వారా పెట్టుబడిని రికవరీ చేస్తున్నారు.
సినిమాకు అసిస్టెంట్ టెక్నీషియన్‌లా ఏఐ
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్రభావం సినిమా రంగంలో ఇప్పటికే ఎక్కువైంది. భవిష్యత్తులో సినిమా మేకింగ్‌లో టెక్నీషియన్ల పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతోంది. స్క్రిప్ట్ అనాలిసిస్ నుంచి డబ్బింగ్, వీఎఫ్‌ఎక్స్ వరకు ఏఐ ప్రవేశిస్తోంది. ఇంకా చెప్పాలంటే, ఏఐ ఇప్పుడు సినిమాకు ఒక అసిస్టెంట్ టెక్నీషియన్‌లా మారిపోయింది. వయసు పెరిగిన స్టార్లను మళ్లీ యంగ్‌గా చూపించడానికి ఏఐ వాడుతున్నారు. ఒకే నటుడి గొంతును ఏఐ సాయంతో వివిధ భాషల్లోకి మార్చడం సులభమైంది.
ఒక భాషలో చెప్పిన డబ్బింగ్‌ను, అదే నటుడి ఒరిజినల్ వాయిస్ బేస్ కోల్పోకుండా (వాయిస్ క్లోనింగ్) ఇతర భాషల్లోకి మార్చేస్తున్నారు. ఏఐ ఉపయోగించి సినిమా సెట్లను, లోకేషన్లను డిజైన్ చేస్తున్నారు. ఇండియన్ సినిమాలో ఏఐ వినియోగానికి ’కల్కి 2898 ఏడీ’ ఒక బెంచ్ మార్క్ అని చెప్పాలి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించారు.
యంగ్ అమితాబ్ బచ్చన్‌ను చూపించడానికి (డీ-ఏజింగ్) ఫ్లక్స్ అనే ప్రత్యేక పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ సాఫ్ట్‌వేర్‌ను వాడారు. దీని ద్వారా ఆయన ముఖ కవళికలను డిజిటల్‌గా మార్చి, దశాబ్దాల క్రితం ఆయన లుక్ ఎలా ఉండేదో అలా తీర్చిదిద్దారు. ఏఐ టూల్స్ వాడటం వల్ల వీఎఫ్‌ఎక్స్ బడ్జెట్‌లో సుమారు 40 నుంచి 50% వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా.
తమ లొకేషన్ నుంచే ప్రపంచ లొకేషన్ల సృష్టి
మేకింగ్‌లో భాగంగా బడ్జెట్‌ను తగ్గించుకుంటూనే క్వాలిటీని పెంచుకునేందుకు టాలీవుడ్ మేకర్స్ వర్చువల్ ప్రొడక్షన్, ఎల్‌ఈడీ వాల్స్ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఒకప్పుడు అవుట్ డోర్ షూటింగ్ అంటే యూనిట్ అంతా వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా ‘అన్‌రియల్ ఇంజిన్’ వంటి టెక్నాలజీ వాడి స్టూడియోలోనే ఫారిన్ లొకేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. రియల్ -టైమ్ రెండరింగ్ కోసం అన్‌రియల్ ఇంజిన్ సాఫ్ట్‌వేర్ వాడుతారు.
కెమెరా కదులుతున్నప్పుడు దానికి అనుగుణంగా వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ కూడా రియల్ -టైమ్‌లోకి మారుతుంది. దీన్ని ‘పారలాక్స్ ఎఫెక్ట్’ అంటారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సినిమాల్లో కొన్ని కీలక సన్నివేశాలను ఈ వర్చువల్ స్టేజ్‌పైనే చిత్రీకరించారు. మరోవైపు గ్రీన్‌స్క్రీన్ కాలం ముగిసిపోతోంది. ఇప్పుడు ‘ఇన్ -కెమెరా వీఎఫ్‌ఎక్స్’ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు నటులు గ్రీన్ క్లాత్ ముందు నిలబడి ఊహించుకుని నటించేవారు.
ఇప్పుడు 360 డిగ్రీల వాల్స్‌పై అన్-రియల్ ఇంజిన్ సాయంతో రూపొందించిన లొకేషన్లన్నీ కళ్లముందే కనిపిస్తున్నాయి. వర్చువల్ ప్రొడక్షన్ కేవలం విదేశీ లోకేషన్లకే పరిమితం కాకుండా, అత్యంత సంక్లిష్టమైన సన్నివేశాల చిత్రీకరణకు వాడుతున్నారు. ఈ కారణంగా అవుట్ డోర్ వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది. ఎండ, వర్షం వంటి వాతావరణ సమస్యలు ఎదురుకావడం లేదు.
ఎల్‌ఈడీ వాల్ నుంచి వచ్చే కాంతి సహజ సిద్ధంగా నటులపై పడుతున్నందున గంటల తరబడి లైటింగ్ సెట్ చేసే పని తప్పుతోంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వంటి పెద్ద సంస్థలు ఇప్పటికే ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉన్న ఎల్‌ఈడీ వాల్ 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఇందులో 2.3 ఎంఎం డాట్ -పిచ్ వాడటం వల్ల విజువల్స్ అత్యంత స్పష్టంగా ఉంటాయి.
నరేశ్ ఆరుట్ల




