4 September, 2026 | 4:55 AM

బీసీ మంత్రి బర్తరఫ్ అన్యాయం

04-09-2026 | 03:35am
  1. కొండా సురేఖ బర్తరఫ్‌ను వెనక్కితీసుకోవాలి
  2. లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడుతాం 
  3. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): బీసీ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం అన్యాయమని, నిరంకుశంగా వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద తప్పిదమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ (Jajula Srinivas Goud, National President of BC Welfare Association) అన్నారు. 

గత పది సంవత్సరాల పరిపాలనలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సందర్భంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇదేవిధంగా నిరంకుశంగా వ్యవహరించి దళిత సామాజిక వర్గానికి చెందిన రాజయ్యను, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసి చేతులు కాల్చుకొని ప్రతిపక్షానికి పరిమితం కావలసిన దుస్థితి ఏర్పడిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ మహిళ మంత్రిని మెడబెట్టి గెంటివేయడం అవమానకరమన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి పునరాలోచన చేసుకొని బర్తరఫ్‌ను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సురేఖ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీసీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతారని హెచ్చరించారు.