గురు రవిదాస్ చిత్రపటంపై ఇంకు చల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాస శ్రీనివాస్
చిట్యాల,(విజయక్రాంతి): సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్(Sant Shiromani Guru Ravidas Maharaj) చిత్రపటంపై ఇంకు చల్లడం దురదృష్టకరమని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని గురువారం బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మాస శ్రీనివాస్ అన్నారు. ఆగస్టు 31న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై, సంత్ రవిదాస్ చిత్రపటాలపై నల్ల ఇంకు చల్లిన ఘటనకు సంబంధించి యువజన కాంగ్రెస్(Congress) రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి, ఆయన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం(SC and ST Atrocities Act) కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు చిట్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో బీజేపీ ఎస్సీ మోర్చా, సమగ్ర మోచి సంఘం ఆధ్వర్యంలో ఎస్సైకి ఫిర్యాదు అందజేశారు. అనంతరం కనకదుర్గ సెంటర్‌లో సంత్ శిరోమణి గురు రవిదాస్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస శ్రీనివాస్ మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ కులాల ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే గురు రవిదాస్ మహారాజ్ చిత్రపటాన్ని అవమానించడం సామాజికంగా ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.






