ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తం
తోపులాటలో కేసముద్రం బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ తలకు గాయం
మహబూబాబాద్,(విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర కార్యాలయం(BJP State Office), నల్గొండ జిల్లా కార్యాలయం జిల్లా అధ్యక్షుడి నివాసంపై, అలాగే నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తల్లి, ఇతర కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ మూకలు జరిపిన భౌతిక దాడి, విధ్వంసాలకు నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గురువారం మహబూబాబాద్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తత కు దారి తీసింది.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి దూసుకెళ్తున్న బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులతో జరిగిన తోపులాటలో కేసముద్రం బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ తలకు గాయమైంది. ఆయనను నాయకులు వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స చేయించారు. కేసముద్రం బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతిపక్షాలపై భౌతిక దాడులకు దిగుతూ అరాచక పాలన సాగిస్తోందన్నారు.






