4 September, 2026 | 1:18 AM

హుజురాబాద్ మున్సిపల్ కౌన్సిల్‌లో 30 అంశాలకు ఆమోదం

03-09-2026 | 11:44pm

వినాయక నిమజ్జనం, బతుకమ్మ–దసరా వేడుకలకు నిధుల కేటాయింపు

హుజురాబాద్,(విజయక్రాంతి): హుజురాబాద్ పురపాలక సంఘం(Huzurabad Municipal Council) సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని రొంటాల అధ్యక్షతన గురువారం నిర్వహించారు. సమావేశంలో ప్రవేశపెట్టిన మొత్తం 30 అంశాలకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. వినాయక నిమజ్జనానికి రూ.9.75 లక్షలు, సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణకు రూ.27.50 లక్షలు కేటాయించారు. వర్షాకాల అత్యవసర సేవల కోసం ఎమర్జెన్సీ వాహనానికి రూ.5 లక్షలు, 146 మంది పారిశుద్ధ్య ఔట్‌సోర్సింగ్ సిబ్బంది(Sanitation outsourcing staff) ఇన్సూరెన్స్‌కు రూ.1.46 లక్షలు మంజూరు చేశారు.

అదేవిధంగా డెడ్‌బాడీ ఫ్రీజర్ల మరమ్మతులు, కొత్త ఫ్రీజర్ కొనుగోలుకు రూ.1.15 లక్షలు, రహదారుల గుంతల మరమ్మతులకు రూ.1 లక్ష, కల్వర్టుల నిర్మాణానికి రూ.2 లక్షలు, వీధిదీపాలు లేని విద్యుత్ స్తంభాలకు లైట్లు ఏర్పాటు చేసేందుకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తూ కౌన్సిల్ తీర్మానించింది. సమావేశంలో వైస్ చైర్‌పర్సన్ గూడూరి అంజలి, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కమిషనర్ బి. కిషన్తో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.