ఉనికి కోసమే కౌశిక్ రెడ్డి డ్రామాలు.. కాంగ్రెస్ నాయకుల విమర్శలు
హుజురాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఏర్పడి వెయ్యి రోజులు పూర్తైన సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ(Huzurabad Constituency) వ్యాప్తంగా ఘనంగా ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒడితల ప్రణవ్ బాబు ఆదేశానుసారం హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీలు చేపట్టి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్ట నాయకులు మాట్లాడుతూ.. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, రైతు భరోసా, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మనసు గెలుచుకుందని పేర్కొన్నారు.
హుజురాబాద్ అభివృద్ధికి ప్రణవ్ బాబు నిరంతరం కృషి చేస్తూ నిధులు తీసుకువస్తున్నారని, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) మాత్రం అభివృద్ధిని అడ్డుకుంటూ ఉనికి కోసం డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. “1000 రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి కౌశిక్ రెడ్డి ఏం చేశారు?” అంటూ ప్రశ్నించారు.
హుజురాబాద్‌లో సుమారు 500 మందితో భారీ ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేశారు. జమ్మికుంటలో భారీ బైక్ ర్యాలీ, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






