ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువ
పాలకుర్తిలో నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
త్వరలో ఎంపీడీఓ కార్యాలయం.. రూ.2 కోట్లతో మహిళా భవన్ నిర్మాణం
పాలకుర్తి,(విజయక్రాంతి): రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు తీసుకెళ్తూ, పాలకుర్తి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భవిష్యత్తులో పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు.
పాలకుర్తి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన తహసీల్దార్, సంయుక్త సబ్ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కార్యాలయాలను గురువారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. నూతన కార్యాలయాలు అందుబాటులోకి రావడంతో మండల ప్రజలకు ప్రభుత్వ, పరిపాలనా సేవలు మరింత సులభంగా, వేగంగా అందనున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారుల సమన్వయంతో రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. పాలకుర్తి మండల ప్రజలకు మరింత మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు త్వరలోనే ఎంపీడీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
రూ.2 కోట్లతో మహిళా భవన్
పాలకుర్తి మండలంలో మహిళల కోసం రూ.2 కోట్లతో మహిళా భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. మహిళల సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారికి అవసరమైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
పాలకుర్తి మండలాన్ని భవిష్యత్తులో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు ద్వారా మండల అభివృద్ధికి మరింత ఊతం ఇస్తామని అన్నారు.
మహిళలకు డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ
అనంతరం తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న నూతన డిజిటల్ రేషన్ కార్డులను మహిళలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఏసీపీ, సీఐ, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






