24 February, 2026 | 10:20 PM

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

24-02-2026 08:14 PM

వాంకిడి(విజయక్రాంతి): ఈనెల 25 బుధవారం నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ ఎం.చంద్రయ్య తెలిపారు. పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. డిపార్ట్మెంటల్ అధికారిగా కె.శ్రీనివాస రావు వ్యవహరించనుండగా, పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, ఫ్యాన్లు, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ఈ పరీక్షలకు ప్రథమ సంవత్సరం నుంచి మొత్తం 244 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 193 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్షా నియమావళిని కచ్చితంగా పాటించాలని, ముఖ్యంగా మొబైల్ ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు కళాశాలకు తీసుకురావద్దని విద్యార్థులకు సూచించారు. పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించబడతాయని, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పర్యవేక్షణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణలో సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు వెల్లడించారు.