30 August, 2026 | 9:45 AM

సకాలంలో స్పందించిన 108 సిబ్బంది.. ప్రాణాపాయం నుంచి యువకుడికి చికిత్స

30-08-2026 08:35 AM

ప్రాణాపాయం నుంచి యువకుడికి చికిత్స

సత్తుపల్లి. ఆగస్టు30,(విజయక్రాంతి): పొలం పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు ఇంటి ముందు ఉన్న సిమెంట్ డ్రైనేజీలో పడిపోయి తీవ్రంగా గాయపడిన ఘటన సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గంగారం గ్రామానికి చెందిన షేక్ నూర్ అహ్మద్ (30) పొలం పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా, ప్రమాదవశాత్తు ఇంటి ముందు ఉన్న సిమెంట్ డ్రైనేజీలోకి వాహనం వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నూర్ అహ్మద్ తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు తలకు సంబంధించిన చర్మం తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సత్తుపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) గొల్లమందల కృష్ణ, పైలట్ పాలడుగు వేణు బాధితుడి పరిస్థితిని పరిశీలించి అక్కడికక్కడే అత్యవసర వైద్య సేవలు అందించారు.అనంతరం బాధితుడిని 108 అంబులెన్స్‌లోకి తరలించి, మార్గమధ్యంలో కూడా అవసరమైన వైద్య సహాయం అందిస్తూ సత్తుపల్లి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి సురక్షితంగా చేర్పించారు. సకాలంలో స్పందించి, అత్యవసర పరిస్థితిలో బాధితుడికి వైద్య సేవలు అందించిన 108 సిబ్బంది గొల్లమందల కృష్ణ, పాలడుగు వేణులను గంగారం గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్, జిల్లా మేనేజర్ ఆలేటి ప్రణయ్ కుమార్ 108 సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రాణాలను కాపాడేందుకు 108 సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.