12 May, 2026 | 4:03 AM

దారులన్నీ కొండగట్టు వైపే

12-05-2026 01:31 AM

నేడు కరీంనగర్‌లో హిందు ఏక్తా యాత్ర

కరీంనగర్/జగిత్యాల, మే 11 (విజయ క్రాంతి): హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు అంజన్న సన్నిధికి భక్తజనం పోటెత్తింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివస్తున్న దీక్షాపరులతో కొండగట్టు కాషాయమయంగా మారింది. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. దీక్షాపరుల ‘జై హనుమాన్‘ నినాదాలతో, రామనామ సంకీర్తనలతో కొండగట్టు పరిసరాలు మారుమోగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి భక్తులు కాలినడకన, వాహనాల్లో తరలివచ్చి మాల విరమణ చేస్తున్నారు.

హనుమాన్ మాల విరమణల కోసం 500 మంది అర్చకులను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 1,500 మంది క్షురకులను ముడుపుల కోసం నియమించారు. 1,100 మంది పోలీసులతో కఠిన భద్రత, ఘాట్ రోడ్లపై నిరంతర నిఘా, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేశారు. బొజ్జాపోతన ఆలయం నుండి కొండగట్టు వై-జంక్షన్ వరకు ఉచిత బస్సులు, పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు, తాత్కాలిక షెల్టర్లు, త్రాగునీరు, మొబైల్ టాయిలెట్లు, లడ్డు, అన్నప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు.

- నేడు కరీంనగర్‌లో హిందు ఏక్తా యాత్ర

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 12న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘హిందూ ఏక్తా యాత్ర’కు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. హిందువులందరినీ సంఘటితం చేయడమే లక్ష్యంగా ప్రతి ఏటా బాల గంగాధర్ తిలక్ గణేశ్ ఉత్సవాలను ప్రారంభించిన సంగతి తెలిసిదే. అదే స్పూర్తితో హిందువులందరినీ రాజకీయాలకు అతీతంగా సంఘటితం చేయాలనే లక్ష్యంతో సరిగ్గా 16 ఏళ్ల క్రితం బండి సంజయ్ కుమార్ గుప్పెడు మందితో కరీంనగర్ లో “హిందూ ఏక్తా యాత్ర”ను ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా గుప్పెడు మంది నుండి వందలుగా, వేలుగా హిందువులంతా తరలివచ్చి హిందూ ఏక్తా యాత్రలో పాల్గొంటున్నారు.

ప్రతి ఏటా హిందూ ఏక్తా యాత్రకు వచ్చే హిందువుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత ఏడాది సైతం భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈసారి అంతకు మించి ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతానికి భిన్నంగా ఈసారి ‘హిందూ ఏక్తా యాత్ర’కు రావాలంటూ కాషాయ శ్రేణులు, కార్పొరేటర్లు ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానిస్తు కరపత్రాలు పంపిణీ చేశారు.

కాషాయ శ్రేణులు తమ తమ డివిజన్లలోని, కాలనీల్లోని గోడలపై ‘హిందూ ఏక్తా యాత్ర’కు తరలి రావాలంటూ స్వయంగా వాల్ పెయింటింగ్ రాశారు. సోషల్ మీడియా ద్వారా విస్త్రత ప్రచారం నిర్వహిస్తున్నారు. సంజయ్ ఆధ్వర్యంలో ఈనెల 12న సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ లోని వైశ్యా భవన్ నుండి ప్రారంభమయ్యే ఏక్తా యాత్ర ర్యాలీ ఆరంభంలోనే వైశ్యాభవన్ వద్ద హిందుత్వ వాదులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగిస్తారు. 

అనంతరం వైశ్యా భవన్ నుండి ప్రారంభమయ్యే ర్యాలీ రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, గంజ్, కమాన్, వన్ టౌన్, వెంకటేశ్వర టెంపుల్, అమరవీరుల స్థూపం, జయశంకర్ సర్కిల్, రాజీవ్ చౌక్ మీదుగా తిరిగి వైశ్య భవన్ కు చేరుకుంటుంది. ఇక్కడే హిందూ ఏక్తా యాత్రను ముగిస్తారు.