ఎయిర్‌పోర్ట్స్ పూర్తిచేయాలి
- రాష్ట్ర ప్రాజెక్టులకు పరిపాలన, సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి
- కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): తెలంగాణలోని విమానాశ్రయ ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా.. వేగంగా పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లో మంగళవారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి.. రామ్మోహన్ నాయుడుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో.. తెలంగాణ రాష్ర్టంలోని విమానాశ్రయాల అభివృద్ధిపై పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌తో సమగ్రంగా చర్చించారు. రాష్ర్టంలోని వివిధ విమానాశ్రయ ప్రాజెక్టుల పురోగతిని ఇద్దరు మంత్రులు సంయుక్తంగా సమీక్షించారు. ఈ సందర్భంగా వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి సహా తెలంగాణలో ప్రతిపాదిత, పనులు జరుగుతున్న విమానాశ్రయ ప్రాజెక్టులపై విసృ్తతంగా చర్చించారు. ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకు అవసరమైన చర్యలు, కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయం వంటి అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించారు.
ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా.. ఏవైనా పరిపాలనా పరమైన, సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తినట్లయితే వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వరంగల్ విమానాశ్రయం విషయంలో మొత్తం 953 ఎకరాల భూమి విమానాశ్రయం కోసం అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు వివరించారు. దీంతో 2500 మీటర్ల రన్‌వే నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డిజైన్, స్కోప్ ఆఫ్ వర్క్, డీపీఆర్‌ను ఖరారు చేసే ప్రక్రియ తుదిదశలో ఉందని మంత్రులకు వివరించారు. 2026 జూన్ నెలలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నామన్నారు.
ఆదిలాబాద్‌లో విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని, అయితే రన్‌వే నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ (కేంద్ర ప్రభుత్వం) పరిధిలో ఉన్న ప్రస్తుత భూమిని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయాన్ని జాయింట్ యూసేజ్ విధానంలో ఉపయోగించే అంశంపై భారత ప్రభుత్వం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖలు..
విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. పెద్దపల్లిలో విమానాశ్రయం కోసం 980 ఎకరాల భూమిని గుర్తించామని.. దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీ కూడా జరుగుతున్నట్లు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమానాశ్రయ మౌలిక వసతుల అభివృద్ధికి సంపూర్ణ మద్దతు అందించేందుకు కట్టుబడి ఉందని ఇద్దరు కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు.




