6 August, 2026 | 2:47 AM

కిమ్స్ వైద్యుల అరుదైన విజయం

06-08-2026 12:00 AM

కిడ్నీ మార్పిడి రోగిలో క్యాన్సర్‌కు విజయవంతమైన చికిత్స

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): 17 ఏళ్ల క్రితం కిడ్నీ మార్పిడి చేయించుకుని ఆరోగ్యంగా జీవిస్తున్న 42 ఏళ్ల మహిళకు వచ్చిన అరుదైన హై గ్రేడ్ లింఫోమా (పేగు క్యాన్సర్)కు విజయవంతంగా చికిత్స అందించి, మార్పిడి చేసిన కిడ్నీని కూడా కాపాడిన ఘనతను సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్స్ వైద్యులు సాధించారు.

కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ అండ్ హీమటో-ఆంకాలజీ నిపుణురాలు డా. మౌనిక బొప్పన తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఈ మహిళకు 2009లో ఆమె తల్లి కిడ్నీ దానం చేయగా, కిడ్నీ మార్పిడి నిపుణులు డా. ఉమమహేశ్వర్ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. 2025లో ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, బరువు తగ్గడం వంటి లక్షణాలతో పరీక్షలు నిర్వహించగా పేగులో హై గ్రేడ్ లింఫోమా ఉన్నట్లు గుర్తించారు. నెఫ్రాలజీ, మెడికల్ ఆంకాలజీ బృందాలు సమన్వయంతో కీమో-ఇమ్యునోథెరపీ అందించగా క్యాన్సర్ గణనీయంగా తగ్గింది.

అనంతరం ఏర్పడిన పేగు సమస్యకు జనరల్ అండ్ జీఐ ల్యాపరోస్కోపిక్ సర్జన్ డా. ఎం.బి.వి. ప్రసాద్ విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. చికిత్స అనంతరం మిగిలిన కీమో-ఇమ్యునోథెరపీ డోసులు పూర్తి చేయగా, పీఈటీ స్కాన్‌లో క్యాన్సర్ పూర్తిగా నయమైనట్లు నిర్ధారణ అయింది. అలాగే మార్పిడి చేసిన కిడ్నీ కూడా సక్రమంగా పనిచేస్తోందని వైద్యులు తెలిపారు. నెఫ్రాలజిస్టు అండ్ కిడ్నీ మార్పిడి నిపుణులు డా. వి.ఎస్. రెడ్డి మాట్లాడుతూ.. నెఫ్రాలజీ, ఆంకాలజీ, సర్జరీ, క్రిటికల్ కేర్ విభాగాల సమన్వయంతో ఈ క్లిష్టమైన కేసులో కిడ్నీని కాపాడుతూ క్యాన్సర్ను పూర్తిగా నిర్మూలించగలిగామని చెప్పారు.