14 July, 2026 | 3:07 PM

Breaking News

సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.... ప్రభుత్వ గిరిజన పాఠశాల   •   17న టీసీఏ జిల్లా జట్ల ఎంపిక   •  

అసత్యం చెప్పిన తీపి కబురు

06-07-2026 12:00 AM

తేనె పూసిన మాటల తట్టలో

అసత్యం విందును వడ్డిస్తోంది

చిరునవ్వుల చీరె కప్పుకొని

చిత్తాన్ని చీల్చే చురకత్తిని తిప్పుతోంది

పంచదార పాకంలో ముంచిన పలుకు

పగబట్టిన ముళ్లను దాచిన పొద !

కళ్లకు కాటుకలా కనిపించి

కాలికి కంచెగా మారి 

గుచ్చుతోంది చూడు

అబద్ధం ఎంత తియ్యగా ఉంటుందో 

మనం అందులోకి ఆసాంతం 

జారిపోయాక

అవలీలగా అవగాహన అవుతోంది !

తీపి కబురంటే?

టీ కప్పులో చక్కెర కరిగినట్టే

లోపల విషపు బొట్టు కలిసిందని 

మనం ఎలా గ్రహిస్తాం? 

మాటల్లో మల్లెలు చల్లి

మనసుల్లో మంటలు పెడుతోంది.. ఎంచక్కా

చూపుల్లో చంద్రబింబం చూపించి

చీకట్ల బావిలోకి నెట్టేస్తోంది.. 

గొప్ప కవ్వింత నెమ్మదిగా నడిచే 

నిజం నచ్చదు

అసత్యపు మెరుపు వేగం 

ఓ గాఢ ఆలింగనం

అందుకే.. తియ్యగా గుండెల్లోకి 

జారే మాటపై

ఓ కన్నేసి వుంచు ! 

కానీ... కాలం అనే కత్తెర్ల పహారాలో

కల్పితాల దృశ్యాలు చిరిగిపోతూనే ఉంటాయి 

కాస్త ఓపిక పట్టాలి.. నువ్వునా.. నేనైనా !

ఐతే.. తీపి కబుర్లన్నీ 

అసత్యం కావు సుమా.. 

అసత్యాలన్నీ

వందశాతం తియ్యగా వుంటాయబ్బా 

ఒక్కటి నిజంగా నిజం

చేదుగా చెప్పినా.. సత్యమే 

మేలుచేస్తుంది నీకు

కాస్త జాగరుకతగా వుండు..

చేదును భరించినా ఫర్వాలేదు.. సత్యాన్ని కోల్పోకు!!

 డాక్టర్ కటుకోఝ్వల రమేష్