10 March, 2026 | 4:21 AM

గంభీర విజయం

10-03-2026 01:21 AM

తన కోచింగ్ మార్క్ చూపించిన గౌతీ

విమర్శలు వచ్చినా తగ్గేదే లే

ప్రయోగాలు చేస్తూనే ఉన్న గంభీర్

వరల్డ్‌కప్ విజయంతో విమర్శలకు చెక్

టెస్టుల్లోనూ సత్తా చూపించేందుకు సిద్ధం

భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి కత్తి మీద సాము లాంటిది... ఎన్నో అంచనాలుంటాయి.. విజయాలు వస్తుంటే అంతా బాగానే ఉంటుంది.. ఒక్క ఓటమి ఎదురైందా ముందు సాధించిన 10 విజయాలను సైతం పక్కన పెట్టేస్తారు... విమర్శలతో ఏకిపారేస్తుంటారు.. అటు ఫ్యాన్స్, ఇటు మాజీలు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తుంటారు. ఈ ఒత్తిడిని తట్టుకుని జట్టును ముందుకు నడిపించడం అతిపెద్ద సవాల్‌గానే చెప్పాలి. ఈ సవాల్‌ను స్వీకరించి, ముక్కుసూటిగా ముందుకు సాగుతూ విమర్శలను లెక్క చేయని గంభీర్ అనుకున్న ఫలితాన్ని వరల్డ్‌కప్‌తో రాబట్టాడు.

రాహుల్ ద్రావిడ్ 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత తన పదవీకాలం ముగియడంతో టీమిండియా కోచ్‌గా తప్పుకున్నాడు. అత ని స్థానంలో బాధ్యతలు తీసుకున్న గంభీర్ డిక్టేటర్‌లా వ్యవహరించా డు. బీసీసీఐతో కొట్లాడి మరీ  తనకిష్టమైన సపోర్ట్ స్టాఫ్ నే తెచ్చుకున్నాడు. తనతో పెద్దగా పొసగని సీనియర్ ప్లేయర్స్‌ను జట్టు నుంచి బయటకు పంపించాడు. ఒకవిధంగా సీనియర్ల రిటైర్మెంట్‌కు పరోక్షంగా కారణమయ్యాడు.

దీనిపై తీవ్ర విమర్శలు ఎదురైనా వెనక్కి తగ్గ లేదు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు, తుది జట్టు ఎంపికలో మార్పులకు శ్రీకారం చుట్టాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌పై టెస్ట్ సిరీస్ ను 0-3 తో కోల్పోయినా, ఆస్ట్రేలియా టూర్ లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సై తం చేజార్చుకున్నా తుది జట్టులోనూ, బ్యాటింగ్ ఆర్డర్ లోనూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. మాజీలు, విశ్లేషకులు విమర్శలు గుప్పించినా గంభీర్ మాత్రం తగ్గేదే లేదంటూ ముందుకే సాగాడు. వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన జట్టుపైనా కొన్ని విమర్శలు వచ్చినా తనదైన వ్యూహాలతో ఆకట్టుకున్నాడు.

కొందరు ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేయ డం, వరుసగా ఫెయిలవుతున్న అభిషేక్ శర్మకు అవకాశాలు ఇస్తూనే ఉండడం కూడా విమర్శలు దారితీసినా గంభీర్ మాత్రం ఎవ్వరినీ ప ట్టించుకోలేదు. అమెరికాతో మ్యాచ్‌లో తడబడినా మిగిలిన మ్యాచ్‌లలో వరుస విజయాలతో సూపర్ 8లోకి వచ్చిన తర్వాత గంభీర్‌కు అసలు సిసలు అగ్ని పరీక్ష మొదలైంది. ముఖ్యంగా సౌతాఫ్రికా చేతిలో అనూహ్య ఓటమితో గంభీర్ గతంలో ఎన్నడూ లేనన్ని విమర్శలు చవిచూడాల్సి వచ్చింది.

ఐసీసీ టోర్నీ మధ్యలో కూడా బ్యాటింగ్ ఆర్డర్ లో పిచ్చి ప్రయోగాలు చేస్తున్నాడంటూ పలువురు మాజీ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విమర్శలేవీ కూడా గంభీర్ నిర్ణయాలను మార్చలేకపోయాయి. పైగా సౌతాఫ్రికాతో మ్యాచ్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి తీసుకున్న నిర్ణయాలు భారత్ జట్టును మళ్లీ గెలుపు బాటలో నడిపించాయి. అప్పటి వరకూ బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకుని ఓపెనర్‌గా పంపించాడు. దీని కో సం ఇషాన్ కిషన్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దింపాడు.

అదే సమయంలో తిలక్ వర్మ బ్యాటింగ్ స్థానం కూడా మార్చాల్సి వచ్చింది. ఈ ప్రయోగాలు మాత్రం అద్భుతమైన ఫలితాలను ఇచ్చా యి. అభిషేక్ శర్మ నిరాశపరుస్తున్నా సంజూ శాంసన్ మాత్రం దుమ్మురేపాడు. అటు ఇషాన్ కిషన్ కూడా కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇక తిలక్ వర్మ గురిం చి చెప్పేదేముంది... ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చే స్తూ భారీ షాట్లు కొట్టడంలో రాటుదేలిపోయాడు. దీంతో గం భీర్ ప్రయోగాలు ఫలితాలను అందించాయి.

అలాగే మ్యాచ్ జరుగుతుండగా బౌలింగ్ మా ర్పుల విషయంలోనూ గంభీర్ మార్క్ కనిపించింది. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో బుమ్రాను దింపిన తీరు దీనికి నిదర్శనం. అలాగే ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో బెథల్ వీరవిహారం చేస్తున్నప్పుడు హార్థిక్, బుమ్రాలను బౌలింగ్‌కు దింపి సక్సెస్ అయ్యాడు. ఇలా తనపై విమర్శలను పట్టించుకోకుండా తాను అనుకున్న విధంగానే జట్టులో మా ర్పులు చేసి ఇప్పుడు టీ20 క్రికెట్‌లో విశ్వవిజేతగా నిలిపాడు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఈ విజ యం ఆటగాళ్ల సమిష్టి కృషితోనే సాధ్యమైందని, తన ఘనత ఏం లేదంటూ గంభీర్ చెప్పడం ఆకట్టుకుంది.

ఈ విజయం వారిద్దరికే అంకితం

ఈ టీ20 ప్రపంచకప్ విజయాన్ని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌కు అంకితం ఇస్తున్నా. భారత క్రికెట్ కోసం రాహుల్ భాయ్ చేసిన కృషి వెలకట్టలేనిది. అలాగే నేషనల్ క్రికెట్ అకాడమీని లక్ష్మణ్ నడిపిస్తున్న తీరు వల్లే మ నకు ఇలాంటి అద్భుతమైన యువ ఆటగాళ్లు లభిస్తున్నారు. న్యూజిలాండ్, సౌతాఫ్రి కా సిరీస్‌ల పరాజయం అనంతరం విమర్శలు ఎదుర్కొన్నాం. ఆ సమయంలో జై షా భాయ్ అండగా నిలిచారు. ఆటగాళ్లే కోచ్‌ను, కెప్టెన్‌ను గొప్పవారిగా మారుస్తారు. మైదానంలోకి వెళ్లి పోరాడి ట్రోఫీని గెలిచింది మా ఆటగాళ్లే.కోచ్‌గా నాది, కెప్టెన్ గా సూర్య గొప్పత నం ఏం లేదు.