స్పిన్ పరీక్షకు సిద్ధమేనా?
భారత బ్యాటర్లకు సవాల్
లంక పిచ్‌లపై అంత ఈజీ కాదు
స్పిన్ ఆడలేకపోతున్న భారత బ్యాటర్లు
యువ బ్యాటర్లకు అసలైన టెస్ట్ట్
ఒకప్పుడు స్పిన్ ఆడడంలో మనకు తిరుగే లేదు. గంటల తరబడి క్రీజులో నిలదొక్కుకుని మ్యాచ్‌లు గెలిచిన సందర్భాలున్నాయి. కానీ కొంతకాలంగా స్పిన్ ఆడడంలో బలహీనత టీమిండియాను వెంటాడుతోంది. సొంతగడ్డపై ఎదురైన ఓటములే దీనికి కారణం. మరి స్పిన్‌కు చిరునామాగా ఉండే లంక పిచ్‌లపై భారత బ్యాటర్లు నిలబడగలరా ?
కొలంబో, ఆగస్టు 5: భారత క్రికెట్ జట్టు రెడ్‌బాల్ క్రికెట్‌కు సిద్ధమైంది. వరుస సిరీస్‌లతో ఇటీవలే రెండు వారాలు రెస్ట్ తీసుకున్న టీమిండియా శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. వరల్డ్‌టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ లో భారత్ 2-0తో గెలవాల్సి ఉంటుంది. సొంతగడ్డపై శ్రీలంకను ఏ మాత్రం తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఇటీవలి కాలంలో టెస్టు ఫార్మాట్‌లో ఆ జట్టు అదరగొడుతోంది. లంక బలమంతా స్పిన్నర్లే కావడం ఇక్కడ భారత్ బ్యాటర్లకు అతి పెద్దపరీక్షగా చెప్పొచ్చు.
ఎందుకంటే గత కొంతకాలంగా భారత బ్యాటర్లు స్పిన్నర్లను ఆడలేక చేతులెత్తేస్తున్నారు. స్వదేశంలో స్పిన్ వ్యూహంతో ప్రత్యర్థులను దెబ్బకొడదామని ప్రయత్నించి చివరికి ఆ ఉచ్చులో తామే చిక్కుకున్నారు. గత ఏడాది సౌతాఫ్రికా, న్యూజిలాండ్ చేతిలో ఓటములకు స్పిన్ ఆడలేకపోవడమే కారణం. ఒకప్పుడు స్పిన్ ఆడడంలో తిరుగులేని భారత్ ఇప్పుడు బంతి గింగిరాలు తిరుగుతుంటే పెవిలియన్‌కు క్యూ కట్టేస్తున్నారు. ఐపీఎల్, వైట్‌బాల్ క్రికెట్ ఎక్కువైన తర్వాత భారత బ్యాటర్లకు స్పిన్ ఆడడం బలహీనతగా మారింది. ముఖ్యంగా రంజీ ట్రోఫీ వంటి దేశవాళీ మ్యాచ్‌లలో టీమిండియా స్టార్ ప్లేయర్స్ ఎవరూ ఆడడం లేదు.
రెడ్‌బాల్ క్రికెట్‌కు సంబంధించి దేశవాళీలోనూ ఆడితేనే స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటారని పలువురు మాజీలు సైతం సూచించారు. అయితే జట్టులోని యువ బ్యాటర్లు ఎవ్వరూ దీనిని పట్టించుకోవడం లేదు. ఇక లంక పిచ్‌లన్నీ కూడా పూర్తిగా స్పిన్‌కే స్వర్గధామంగా ఉంటాయి. ఇక్కడ స్లో బౌలర్లు పండగ చేసుకుంటారు. దీంతో భారత బ్యాటర్లకు కఠిన సవాల్ ఎదురుకానుంది. లంక పిచ్‌లపై బాల్ విపరీతంగా టర్న్ అవుతుంది. అలాంటి బంతులను ఆడడం అంత సులభం కాదు. టెస్ట్ క్రికెట్‌లో ఫాస్ట్ బౌలింగ్ తో పోలిస్తే స్పిన్‌ను ఎదుర్కోవడం ఇంకా సవాల్. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదించి, బౌన్స్ అంచనాకు అందదు.
లంక స్పిన్ అటాక్ను ఎదుర్కోవడం, ముఖ్యంగా గాలే ప్పి ప్రభాత్ జయసూర్య వంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను తట్టుకోవడం గిల్ నేతృత్వంలోని యువ జట్టుకు పెద్ద పరీక్షగా చెబుతున్నారు. యువ బ్యాటర్లు స్పిన్‌కు వ్యతిరేకంగా డిఫెన్స్ ఆడటంలో ఇటీవల తడబడుతున్నారు. స్పిన్ పిచ్లపై స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో పాటు ఖచ్చితమైన ఫుట్వర్క్ ఉంటే క్రీజులో నిలదొక్కుకునే అవకాశముంటుంది. మరి ఇలాంటి పిచ్‌లపై మన బ్యాటర్లు ఎంతవరకూ నిలదొక్కుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. పైగా ఎనిమిదేళ్ల తర్వాత శ్రీలంక గడ్డపై భారత్ టెస్ట్ ఆడుతోంది.
దీంతో అక్కడి వాతావరణ పరిస్థితులకు, పిచ్లకు వీలైనంత త్వరగా అలవాటు పడితే తప్ప సిరీస్ విజయంపై ఆశలు పెట్టుకోలేం. అయితే స్పిన్ బలహీనతను అధిగమించడానికి , లంక స్పిన్ ఉచ్చులో పడకుండా ఉండటానికి టీమిండియా ప్రస్తుతం ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమవుతోంది. లంక స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు బీసీసీఐ నలుగురు యువ స్పిన్నర్లను నెట్ బౌలర్లుగా శ్రీలంకకు పంపింది. ఆఫ్ స్పిన్నర్ తనుష్ కొటియన్ , లెగ్ స్పిన్నర్ విప్రాజ్ నిగమ్, స్పిన్ ఆల్ రౌండర్ హర్ష్ దూబే, లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
లంక పిచ్‌లపై భారత బ్యాటర్లకు అంత ఈజీ కాదు. మన బౌలింగ్ కంటే బ్యాటింగ్ గురించే ఆందోళన చెందుతున్నా. లంక స్పిన్నర్లు తమ సొంతగడ్డపై మరింతగా చెలరేగుతారు. పైగా భారత బ్యాటర్లు స్పిన్ ఆడడంలో తడబాటు లంకకు మరింత అడ్వాంటేజ్ అవుతుంది. స్పిన్ పిచ్‌లపై మన బ్యాటర్లు ఎలా ఆడతారనేదే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది
దీప్‌దాస్ గుప్తా, మాజీ క్రికెటర్






